
- రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం: సీఎం
- ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని, దానితో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 55 వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ మంజూరు చేసి పనులు చేపట్టామన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ చార్జి మీనాక్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.