తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతోపాటు కుల గణన చేపడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.. వారి ఆర్థిక పరిస్థితి ఏంటీ.. ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. దీని ద్వారా బలహీన వర్గాలకు మరింత ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు.. పదేళ్లు దాటినా బయటపడలేదని.. పదేళ్లుగా దాచుకున్నారంటూ ఎద్దేవ చేశారు. బలహీన వర్గాల సర్వే చేస్తుంటే.. అర శాతం ఉన్న వారికి ఎందుకు కడుపు మండుతుందో అర్థం కావటం లేదంటూ కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఎత్తిచూపుతూ చురకలు అంటించారు. కుల గణనపై తీర్మానం చేస్తుంటే.. కేసీఆర్ సభకు కూడా రాలేదంటూ చురకలు అంటించారు.
సమగ్ర కులగణన సర్వే వివరాలను సభకు సమర్పిస్తామని.. అన్ని వివరాలు బహిర్గతం చేస్తామని.. గోప్యంగా ఉంచేది లేదన్నారు. సర్వేలో వచ్చిన వివరాల ప్రకారం.. ఏయే సామాజిక వర్గాలకు న్యాయం చేయాల్సి ఉంటుంది.. ఎవరికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది అనేది స్పష్టత వస్తుందని.. ఆ ప్రకారం ముందుకు వెళతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1931లో మొదటి సారి సమగ్ర కుల గణన జరిగిందని.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 2011లో కుల గణన జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కుల గణన జరుగుతుందని.. బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.