- మన రాష్ట్రానికి ఇకనుంచి ఇదే ట్యాగ్‌లైన్
- అమెరికా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
- కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్ కంపెనీ ప్రముఖులతో సమావేశం
- -హైదరాబాద్ డెవలప్మెంట్లో పాలుపంచుకోవాలని పిలుపు
- ఐటీ సర్వ్ అలయన్స్ వార్షికోత్సవానికి రేవంత్‌కు ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు : ఇకపై మన రాష్ట్రాన్ని.. ‘‘తెలంగాణ ఫ్యూచర్ స్టేట్’’ అని పిలుద్దామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ట్యాగ్‌లైన్ ఖరారు చేసినట్టు ప్రకటించారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా నిలుస్తుందని తెలిపారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈవోలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం” అని పిలుపునిచ్చారు.
‘‘ఇప్పటి వరకు మేం న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. ‘అవుటాఫ్ మెనీ.. వన్’ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను ‘లోన్ స్టార్ స్టేట్’ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు ‘యురేకా’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. మన దేశంలో రాష్టాలకు ఇలాంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని ‘తెలంగాణ ఫ్యూచర్ స్టేట్’ అని పిలుద్దాం’’ అని సీఎం వెల్లడించారు.
కాగా, ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రి డీ శ్రీధర్‌బాబు అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.
హైదరాబాద్ డెవలప్మెంట్లో పాలుపంచుకోండి : సీఎం రేవంత్
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ‘ఐటీ సర్వ్ అలయన్స్’ సమావేశంలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వామ్యం కావాలని కోరారు. ‘ఎన్నో ఏండ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసి ప్రపంచస్థాయి నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నాం.
హైదరాబాద్‌లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగపడుతుంది’’ అని తెలిపారు. రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించే భారీవ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుందని
ప్రపంచస్థాయి ప్రమాణాలున్న భవిష్యత్ సిటీగా మారుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాలను వృద్ధి చేసి, తయారీ రంగాన్ని విస్తరిస్తామని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఎంచుకున్నట్టు చెప్పారు.
ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా ఐటీ సర్వ్ అలయన్స్
అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా.. ఐటీ సర్వ్ అలయన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది చివర్లో వేగాస్‌లో ఐటీ సర్వ్ అలయన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతారు. ఈ ఉత్సవాలకు రావాలని అలయన్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు.