![మోదీ బీసీ కాదు .. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ: సీఎం రేవంత్‌రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-cm-revanth-reddy-demands-nationwide-caste-census_2PJfHhE9zb.jpg)
- కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి
- బీసీలను ముంచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు
- అందుకే ఇక్కడి కులగణనపై బురద చల్లుతున్నరు
- కొందరు అంటున్నట్లు ఆఖరి రెడ్డీ సీఎంను నేనే అయినా పర్వాలేదు
- ఏ త్యాగానికైనా సిద్ధమనే పకడ్బందీగా కులగణన సర్వే చేసినం
- సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేయాలి
- కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు.. బయటికొచ్చి నిటారుగా నిలబడు
- అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని, నీ అల్లుడ్ని బండకేసి కొట్టు
- లిక్కర్ దందాతో కేజ్రీవాల్‌ను ఓడించిన నీ బిడ్డను రెండు కొట్టు
- రాష్ట్రానికి నిధులివ్వని మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు
- ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ వివరాలు ఇవ్వాలి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ మనసంతా బీసీలపై వ్యతి రేకతతో నిండిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘వాస్తవానికి మోదీ బీసీ కాదు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు మోదీ కులం గుజరాత్లో ఉన్నత వర్గాల్లో ఉండేది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంక చట్టం చేసి తన కులాన్ని బీసీల్లో కలుపుకున్నడు. ఇప్పుడు ఆయన సర్టిఫి కెట్ బీసీగా ఉండొచ్చు.. కానీ, మనస్తత్వం మాత్రం బీసీల వ్యతిరేక మనస్తత్వం” అని వ్యాఖ్యానించారు. నిజంగా మోదీ బీసీ ప్రధానమంత్రి అయితే.. 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదని, బీసీ కులాల లెక్కలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే, బీసీలపై చిత్తశుద్ధి ఉంటే దేశమంతా జనగణనతోపాటు కులగణన చేపట్టాలని సీఎం రేవంత్డిమాండ్ చేశారు. బలహీనవర్గాల లెక్కలు ఇప్పటివరకు ఎవరూ చేయలేదని, లెక్కకట్టని లెక్కలు చూపెట్టి తాము చేసిన కులగణనను తప్పు అనడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ అంశంపై బలహీనవర్గాల ప్రజలు, మేధావులు ఆలోచించాలని కోరారు. ఏ రాష్ట్రం, ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని తమ ప్రజా ప్రభుత్వం చేసిందని, కులగణనను చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఇంత గొప్పలక్ష్యం ముందు ఎవరైనా చిన్నచిన్న ఆరోపణలు చేస్తే వాటి గురించి ఆలోచించొద్దన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో, కులగణన, ఎస్సీ వర్గీకరణపై పీసీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్‌లో సీఎం రేవంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఇంటి ముందు బలహీనవర్గాల సోదరులు మేల్కొలుపు డబ్బు కొట్టాలని పిలుపునిచ్చారు. ‘‘వాళ్లు సర్వే లెక్కలోకి రానంత వరకు మీ(బీసీల) లెక్కలు తప్పని చెప్తరు. వాళ్లను లైన్లో నిల్చోబెట్టి లెక్కలోకి తీసుకురండి” అని సూచించారు.
ఎక్కడ తప్పుందో చాలెంజ్ చేయండి
దేశమంతా కులగణన చేయాలని మోదీపై ఒత్తిడి పెరుగుతదన్న భయంతోనే బీజేపీ నేతలు రాష్ట్రంలో కులగణనను విమర్శిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇక్కడ బోడీ, ఢిల్లీలో మోదీ కావాలనే అడ్డుతగులుతున్నరు. అన్నివర్గాలకు ఫలాలు దక్కాలన్న సంకల్పంతో కులగణనకు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టు పకడ్బందీగా రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించాం. దేశంలోనే కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాం” అని అన్నారు.
‘‘కులగణనపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లకు బీసీ మేధావులు చాలెంజ్ చేయండి. ఏ లెక్క తప్పుందో, ఏ వార్డులో తప్పుందో, ఏ ఇంట్లో తప్పుందో చెప్పమనండి” అని సీఎం కోరారు. ‘‘కులగణనలో పాల్గొననివాళ్లు 3.1 శాతం ఉన్నరు. లెక్కల్లోకి వచ్చినవాళ్లు 96.9 శాతం ఉన్నరు. లెక్కకు రానోళ్లకు మళ్లీ సర్వేకు చాన్స్ ఇచ్చినం. వాళ్లు కూడా లెక్కల్లోకి వస్తే.. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు పెరగడానికి చాన్స్ ఉంటుంది” అని తెలిపారు.
ఇక్కడ బోడీ.. అక్కడ మోదీ అడ్డుతగులుతున్నరు
బడుగు, బలహీన వర్గాలకు నష్టం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ బోడీ(కేసీఆర్), ఢిల్లీలో మోదీ కులగణనను అడ్డుకుంటున్నారని సీఎం మండిపడ్డారు. కులగణనలో ఏ లెక్క తప్పు ఉందో చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. మైనార్టీలు రిజర్వేషన్లు పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. ‘‘మోదీ వాట్సప్ యూనివర్సిటీతో.. కేటీఆర్ సోషల్ మీడియా వర్సిటీతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నరు. వారెన్ని చేసినా జనం నమ్మరు” అని పేర్కొన్నారు.
ఒక లక్ష 4 వేల మందితో కులగణన సర్వే చేయించామని వివరించారు. ‘‘కేటీఆర్ లాంటి తింగరోడు దీనిపై విమర్శలు చేస్తడనే.. ఎన్ రోల్ ఫామ్ పై ఇంటి పెద్దల సంతకం తీసుకున్నాం. పకడ్బందీగా సర్వే నిర్వహించాం” అని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కాకి లెక్కల సర్వే” అని విమర్శించారు. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావుకు తెలంగాణ సమాజంలో జీవించే హక్కు లేదని, వారిని తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాలన్నారు.
కేసీఆర్.. నీ కొడుకు, బిడ్డ, అల్లుడ్ని కొట్టు
“ఫామ్‌హౌస్‌లో పండుకున్న కేసీఆర్ నన్ను కొడ్తా..కొడ్తా...అని అంటున్నడు. ముందుగా ఆయన బయటికొచ్చి సక్కగా నిలబడుడు నేర్చుకోవాలి” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్..! నీకు అంతగా కొట్టాలనుంటే.. ముందు నీ కొడుకును రెండు కొట్టు, ఎందుకంటే వాడు పిచ్చి, పిచ్చిగా మాట్లాడుతుండు. ఆ తర్వాత నీ బిడ్డను కొట్టు.. ఎందుకంటే లిక్కర్ దందా చేసి ఇక్కడ నిన్ను ఓడించుడే కాదు, ఢిల్లీలో నీ దోస్త్ కేజ్రీవాల్ ను ఓడగొట్టినందుకు. నీ అల్లుడ్ని కూడా బండకేసి కొట్టు..! ఎందుకంటే అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిండు” అని సీఎం అన్నారు.
కులగణనపై బీఆర్ఎస్ కుట్ర: డిప్యూటీ సీఎం భట్టి
కులగణన జరగకుండా బీఆర్ఎస్ కుట్ర పన్నిందని, అయినా ప్రభుత్వంపై విశ్వాసంతో ప్రజలు ఈ సర్వేలో ఇష్టంగా పాల్గొన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా వివరాలు ఇచ్చి ఎన్ రోల్ ఫామ్‌పై సంతకాలు పెట్టారని, అయినా బీఆర్ఎస్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ‘‘అన్ని ఫలాలు జనాభా దామాషా ప్రకారం పంచాలన్నదే రాహుల్ గాంధీ ఆలోచన.
అందుకే ప్రణాళిక బద్దంగా కులగణన సర్వే చేపట్టాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం చేసింది” అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అనేది ఏ కులానికో, ఏ వర్గానికో వ్యతిరేకం కాదని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. త్వరలోనే ఈ వర్గీకరణ అమల్లోకి వస్తుందని, ఆ తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్నారు.
పీసీసీ కార్యవర్గం కోసం కసరత్తు: మహేశ్‌గౌడ్
రాహుల్ గాంధీ ఆలోచన, ఆశయం మేరకే కులగణన సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కుల గణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలని పేర్కొన్నారు. పీసీసీ కార్యవర్గంతో పాటు ఇతర పదవుల భర్తీ కోసం కసరత్తు జరుగుతున్నదని తెలిపారు.
‘‘కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు తండ్రి మీద కొడుకు అలక బూనినట్లు పార్టీ నాయకత్వంపై కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం. వారందరికీ త్వరలోనే న్యాయం జరిగేలా కృషి చేస్తా” అని ఆయన హామీ ఇచ్చారు. కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టబద్ధత కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి, పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై మోదీ వివక్ష
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణకు నిధులివ్వని ప్రధాని మోదీపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ సిద్ధం కావాలి. దీనిపై త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తాం. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బుగ్గ కార్లలో తిరుగుడు కాదు.. తెలంగాణ కోసం వారు ఏం తెచ్చారో చెప్పాలి” అని ఆయన ప్రశ్నించారు. డబ్బులున్నోళ్లు ఎన్నికల్లో గెలుస్తారనుకోవడం పోరపాటని.. అట్లయితే లారీల కొద్ది డబ్బులున్న కేసీఆర్ వంద సీట్లు గెలుస్తుండెనని అని సీఎం అన్నారు.
కామారెడ్డిలో ప్రజలు బండకేసి కొడితే కేసీఆర్ ఓడిపోయారని తెలిపారు. ‘‘ఎన్నికల్లో డబ్బుతో గెలువచ్చనుకుంటే పొరపాటు. నిత్యం ప్రజల్లో ఉండాలి.. వారి సమస్యలపై పోరాడాలి.. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి” అని యూత్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. పని చేయకుండా దండం పెడ్తామంటే పదవులు రావని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం..
రేవంత్‌రెడ్డి అని కొందరు నన్ను అంటున్నరు. నేను చివరి సీఎంను అయినా పర్వాలేదు.. మా నాయకుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు మేం సిద్ధం. అందుకే కులగణన చేశాం. ఇదీ మా నిబద్ధత. బీసీలను, ఎస్సీలను ఎందుకు తక్కువగా చూపిస్తాం? ఎక్కువ చూపించాలనుకుంటే.. మా కులాన్ని చూపించే వాడ్ని కదా.. మా జాతిని 5 శాతం మాత్రమే ఎందుకు చూపిస్తాం.. 20 శాతం పెంచుకోలేమా..?- సీఎం రేవంత్ రెడ్డి