14 వేల మంది స్టూడెంట్లతో సీఎం సమావేశం

14 వేల మంది స్టూడెంట్లతో సీఎం సమావేశం
  • ఈ నెల 14 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు 
  • ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 14  నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు సర్కారు నిర్ణయించింది. మొదటి రోజు (14న) మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) సందర్భంగా ఎల్​బీ స్టేడియంలో దాదాపు 14 వేల మంది ప్రభుత్వ, గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులతో విద్యా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని  సీఎస్ స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం సెక్రటేరియెట్​లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది కాలంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం చేసిన గణనీయమైన మార్పులపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. డైట్ చార్జీల పెంపు, బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు, సర్కారు బడులకు ఉచిత కరెంట్ తదితర అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేసిందని గుర్తుచేశారు. 

ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులతో మోడల్ అసెంబ్లీ, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, ఈ ఏడాది కాలంలో విద్యాశాఖలో మార్పులు, అభివృద్ధిపై ఏవీ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. విద్యాశాఖపై ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని వెల్లడించారు. ఎల్​బీ స్టేడియంలో మధ్యాహ్నం నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను సీఎస ఆదేశించారు.