పైసా కైసా?.. ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం ఫోకస్

పైసా కైసా?..  ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం ఫోకస్
  • పైసా కైసా?
  • ఆరు గ్యారెంటీల అమలుపై సీఎం ఫోకస్
  • స్కీంల అమలు కోసం ఆర్థిక నిపుణుల సలహాలు
  • ఆదాయం వచ్చేశాఖలతో ఇప్పటికే  సీఎం రివ్యూ
  • కొత్త అప్పులు తీసుకురావడంపైనా సర్కారు ఆరా
  • ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో భేటీ అందుకేనా?
  • రేపు అసెంబ్లీ వేదికగా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం 
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం

హైదరాబాద్ : ఖాళీ ఖజానాతో పథకాల అమలు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో  నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వం సంక్రాంతి  నాటికి మరో రెండు హామీలను అమల్లోకి తేవాలని యోచిస్తోంది. మార్చి 16 నాటికి ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నది. 

ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు ఇప్పటికే పలు శాఖలపై రివ్యూ చేశారు. ఏ శాఖను చూసినా అప్పుల మయంగా ఉండటం, కార్పొరేషన్ల పేరిట భారీగా రుణాలు తీసుకున్న విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎఫ్​ఆర్బీఎం నిబంధనలకు విఘాతం కలుగకుండా కొత్త అప్పులు తీసుకోవడంపై సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తోంది. 

రేపే శ్వేతపత్రం 

గత ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాజా పరిస్థితిని, గత పాలకులు చేసిన అప్పులనూ ప్రజల ముందు ఉంచవచ్చని ఆయన భావిస్తున్నారని సమాచారం. కొత్త అప్పులు తెచ్చినా, ఆదాయ సమీకరణ కోసం ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.