హైడ్రా పవర్​ఫుల్ .. బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం

హైడ్రా పవర్​ఫుల్ .. బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం
  • గ్రేటర్ హైదరాబాద్​లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు
  • ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ
  • సర్కార్ భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలు  
  • ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు.. జరిమానాల వసూలు కూడా  
  • ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్, తాగునీటి సరఫరా సైతం.. 
  • కొత్త విభాగం విధివిధానాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం
  • అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం విధివిధానాలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఉన్న ఎన్​ఫోర్స్​మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది.

దీనిపై శుక్రవారం సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా విభాగం విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ‘‘గ్రేటర్ ​హైదరాబాద్​ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడుతూ అక్రమ నిర్మాణాలకు చెక్​పెట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు.

‘‘అందుకు అనుగుణంగా ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్​మెంట్​విభాగాన్ని పునర్‌‌‌‌ వ్యవస్థీకరించాలి. కేవలం ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ, పునరావాస చర్యలకే పరిమితం కాకుండా.. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే విధంగా హైడ్రా పరిధి ఉండాలి. ఓఆర్ఆర్​వరకు విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలను హైడ్రాకే అప్పగించాలి. ఎక్కడైనా కబ్జాలు జరిగినట్టు ఫిర్యాదు వస్తే ఆక్రమణలు తొలిగించే అధికారం ఉండాలి. నిబంధనలు పాటించకుండా ఫ్లెక్సీలు, హోర్డింగులు పెడితే తొలగించడం..

ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్​సరఫరాలో ఆటంకాలు లేకుండా చూసే బాధ్యతలనూ అప్పగించాలి. విస్తరిస్తున్న సిటీ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలు అందించేలా హైడ్రాను తీర్చిదిద్దాలి” అని రేవంత్​ సూచించారు. ఈ వింగ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ పరిధిలోనే పని చేస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ హైడ్రా పని చేయాలని.. అందుకు తగ్గట్టు దాని వ్యవస్థాగత నిర్మాణం, విధివిధానాలు ఉండాలని సూచించారు. 

డివిజన్ల ఏర్పాటు.. 

హైడ్రా విభాగం ఎలా పని చేస్తుందనే దానిపై ప్రపోజల్స్ తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ‘‘కొత్త విభాగంలో ఏయే స్థాయి అధికారులు ఉండాలి? ఎంత మంది సిబ్బంది అవసరం? ఏయే విభాగాల నుంచి అధికారులను డిప్యుటేషన్​పై తీసుకోవాలి? అనే అంశాలపై స్పష్టమైన ప్రపోజల్స్ రెడీ చేయండి. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు 2వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుంది.

పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో డివిజన్లు ఏర్పాటు చేయాలి. అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలి” అని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీల తొలగింపు, జరిమానాల వసూలు బాధ్యత కూడా హైడ్రాకు బదలాయించాలని చెప్పారు.

నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

పాస్ పోర్ట్​ రెన్యువల్​ చేసుకున్న సీఎం

పాస్​పోర్ట్ రెన్యువల్ నిమిత్తం హైదరాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్ట్ కార్యాలయానికి సీఎం రేవంత్​ రెడ్డి శుక్రవారం వెళ్లారు. ఆగస్టులో విదేశీ పర్యటన నేపథ్యంలో ఆయనే స్వయంగా వెళ్లి పాస్​పోర్టు రెన్యువల్​ చేయించుకున్నారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.  

నేడు జేఎన్టీయూకు రేవంత్

సీఎం రేవంత్  రెడ్డి శనివారం కూకట్ పల్లిలోని జేఎన్టీయూహెచ్​కు రానున్నారు. సుమారు రెండున్నర గంటల పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గోల్డెన్  జూబ్లీ బిల్డింగ్ ను ఆయన ప్రారంభిస్తారు. ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్​లో క్వాలిటీ పెంపుపై ‘క్వాలిటీ ఆఫ్‌‌‌‌  ఇంజినీరింగ్‌‌‌‌  ఇన్‌‌‌‌  టెక్నికల్‌‌‌‌ కాలేజెస్‌‌‌‌’ అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. దీనికి జేఎన్టీయూతో పాటు, ఓయూ, కేయూ పరిధిలోని ప్రైవేటు, గవర్నమెంట్  కాలేజీల  నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

మేనేజ్మెంట్లతో సమావేశం అనంతరం.. బ్యాంకింగ్‌‌‌‌  అండ్‌‌‌‌  ఫైనాన్షియల్‌‌‌‌  స్విస్‌‌‌‌  అండ్‌‌‌‌  ఇన్స్యూరెన్స్‌‌‌‌  పరిశ్రమ నిపుణులతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌  ఆఫీసర్లు, కో ఆర్డినేటర్లు, వాలంటీర్లు, పోలీసు అధికారులతో డ్రగ్స్‌‌‌‌ నియంత్రణ, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌‌‌‌  నియంత్రణ, మహిళలు, బాలికల రక్షణ వంటి అంశాలపై చర్చించనున్నారు.  ‘ఏఐ.. సమాజంపై దాని ప్రభావం’ అంశంపై అధికారులతో సమీక్షించి, ఏఐ లోగో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొననున్నారు.