
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. మంగళవారం ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం.. కేబినెట్ విస్తరణ పై అగ్రనేతలు ఖర్గే, రాహుల్ నేతృత్వంలో ఇందిరా భవన్లో జరిగిన కీలక భేటీలో పాల్గొన్నారు.
అయితే.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరే సమయంలో రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడ 10 నిమిషాలు ఉన్నారు. అనంతరం నేరుగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు పయనమయ్యారు. ఆ టైమ్లో ఖర్గే తన నివాసంలో ఉన్నారా? లేదా? అన్న అంశంపై సీఎంవో, పార్టీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.