- ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఖర్గే
- ఢిల్లీలో దాదాపు గంటపాటు పార్టీ ఏఐసీసీ చీఫ్‌తో సీఎం భేటీ
- రాష్ట్రంలోని పరిస్థితులు, పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులపై చర్చ
- అంతకుముందు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో మీటింగ్
న్యూఢిల్లీ, వెలుగు: ఒక్కరోజు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కథువా లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ.. మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా, ఖర్గేను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీ వచ్చారు. మంగళవారం ఉదయం రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. అనంతరం సుమారు 50 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతున్న తీరు, రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో పార్టీ గెలుపు అంశాలపై చర్చించారు. జమ్మూ కాశ్మీర్, హర్యానాలో పార్టీ ఆశించిన ఫలితాలు సాధిస్తుందని, ఈ గెలుపు సంబురాలను తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలనే పార్టీ ఆలోచనను ఖర్గే వివరించినట్టు తెలిసింది. అనంతరం తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులను సీఎం వివరించారు.
ఆరు గ్యారంటీల అమలు, రైతులకు రుణమాఫీ, హైడ్రా, మూసీ రివర్ డెవలప్మెంట్, ఇతర అంశాలను ఖర్గేకు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలను వివరించారు. హైడ్రా ఏర్పాటు తర్వాత మారుతున్న సమీకరణాలు, ప్రతిపక్షాల గగ్గోలు, ప్రజల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా తెలిపారు. మూసీ రివర్ డెవలప్మెంట్విషయంలో పేదల పేరుతో బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆందోళనలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.
మూసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలను వివరించారు. రాజకీయ కక్షలో భాగంగా ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేసిందని ఖర్గేతో రేవంత్ చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బీసీ డిక్లరేషన్, జన గణన అంశాలపై కూడా చర్చించినట్టు సమాచారం.
కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటి
అంతకుముందు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పాలన తీరును నివేదిక రూపంలో అందజేసినట్టు తెలిసింది. ఇటీవల పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పార్టీ, ప్రభుత్వం మధ్య సఖ్యతను వివరించారు. అలాగే, త్వరలో ప్రకటించబోయే నూతన కమిటీలపై చర్చించినట్టు తెలిసింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసేలా ఆలోచన చేయాలని కేసీ సూచించారు.
హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్డెవలప్మెంట్పై ప్రతిపక్షాల ఆందోళనలు, ప్రభుత్వ చర్యలను రేవంత్ వివరించారు. మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే, తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపికైన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనుసింఘ్విని రేవంత్ కలిసి, కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, హామీల్లో జాప్యం, ఇతర విషయాలను రాజ్య సభలో లేవనెత్తాలని సూచించారు.