- వర్సిటీకి నిధులిచ్చేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నయ్
- అదానీ కంపెనీ కూడా ముందుకొచ్చింది.. సీఎస్ఆర్ కింద ఆమోద లేఖ మాత్రమే ఇచ్చింది
- ఇప్పటి వరకు ఏ కంపెనీ నుంచి కూడా రూపాయి తీస్కోలేదు
- బీఆర్ఎస్ హయాంలోనే అదానీ కంపెనీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు, భూములు
- వాటిపై విచారణకు కేటీఆర్ సిద్ధమా? అదానీకి వంగి వంగి దండాలు పెట్టిందే కేసీఆర్
- రాష్ట్రానికి నిధుల కోసం ఎన్నిసార్లయినా ఢిల్లీకి వెళ్తాం.. కేంద్రాన్ని కలుస్తం.. నిలదీస్తం
- బీఆర్ఎస్ వాళ్ల లెక్క కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రం కాదని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అదానీ లంచాల విషయంలో రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు అదానీ సంస్థకు స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ ఆదివారమే లేఖ రాశారని ఆయన తెలిపారు. అదానీ పెట్టుబడులు, ఒప్పందాలు రద్దు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేక ఒప్పందాలు చేసుకుందని సీఎం చెప్పారు. వాటిని రద్దు చేయడమంటే.. అనుమతులు ఇచ్చిన కేటీఆర్ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఇక ప్రతిసారి తాను గానీ, మంత్రులు గానీ ఢిల్లీకి వెళ్తే కొంతమంది అర్రాస్ పాట లెక్క 26వ సారి, 27వ సారి, 28వ సారి అని పాట పడుతున్నారని మండిపడ్డారు. ఈసారి ఢిల్లీ పర్యటన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురి వివాహానికి హాజరయ్యేందుకేనని, అదేవిధంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ఎంపీలతో చర్చిస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ కోసం ఈ పర్యటన కాదన్నారు.‘‘బీఆర్ఎస్ వాళ్లలాగా పైరవీల కోసమో, కాళ్లు పట్టుకోవడానికో, కేసులను ఎత్తివేయించుకోవడానికో, మోదీ ముందు మోకారిల్లాడానికో ఢిల్లీ వెళ్లడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతుల కోసమే ఢిల్లీ పర్యటన చేస్తున్నం. ఎవరి కాళ్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు” అని సీఎం వ్యాఖ్యానించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఏ సంస్థ నుంచి కూడా రూపాయి తీస్కోలేదు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడ్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇచ్చేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని, దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా రూ.100 కోట్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) కింద ఇస్తామని ఆమోద లేఖ అందజేసిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వానికో, సీఎంకు అప్పన్నంగా వంద కోట్లు ఇచ్చినట్లుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘వాస్తవంగా ఇన్‌కం ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి నిన్న మొన్ననే 80బీ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఐటీ మినహాయింపు అనుమతి వచ్చింది.
ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదానీ నుంచి కూడా తీసుకోలేదు. అయితే తెలంగాణ ప్రతిష్ట, వ్యక్తిగతంగా నా గురించి అనవసర చర్చ జరగడం మంత్రివర్గ సహచరులకు, నాకు సుతారం ఇష్టం లేదు. అందుకే నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ ద్వారా అదానీ సంస్థకు లేఖ రాశాం. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం.. స్కిల్ యూనివర్సిటీకి మీరు ఇస్తానన్న రూ.100 కోట్లు స్వీకరించడానికి సిద్ధంగా లేదని అందులో స్పష్టం చేశాం. మీ వంద కోట్లు తెలంగాణకు బదిలీ చేయొద్దని ఆ సంస్థకు లేఖలో తెలిపాం. పక్క రాష్ట్రాలు, దేశాల్లో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ విషయంలో జరుగుతున్న వివాదానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించి.. ప్రపంచంతో పోటీపడాలని స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఇలాంటి యూనివర్సిటీ అనవసర రాద్ధాంతంలోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే అదానీ సంస్థకు రూ.100 కోట్ల విరాళం వద్దని చెప్పాం” అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకునే నిధులపై కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని ప్రతిపక్షాలకు సూచించారు.
నిబంధనల ప్రకారమే టెండర్లు, పనులు
గత నాలుగైదు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై దుమారం చెలరేగుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే.. అదానీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిధులను స్వీకరించారు కదా ? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ తప్పులను ప్రశ్నిస్తుందని మీడియా అడిగింది. ఈ విషయమై నేను వివరణ ఇచ్చాను. రాహుల్ గాంధీ కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన నిబంధనల మేరకు టెండర్లు నిర్వహించి ఎవరు రాణిస్తే వాళ్లకు కాంట్రాక్టులు, పనులు కేటాయిస్తుంది. ఏదైనా విషయాలతో అదానీనే కాదు, అంబానీ కావొచ్చు.. టాటా కావొచ్చు, బిర్లా కావొచ్చు.. ఈ దేశంలో ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి రక్షణ ఉంటుందని రాహుల్ గాంధీ వివరించారు” అని ఆయన తెలిపారు.
ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదు
ప్రతిసారి సీఎం గానీ, మంత్రులు గానీ ఢిల్లీ పర్యటనకు వెళ్లాలి అనుకున్నప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ, అధిష్టానంతో చర్చలు, శాఖలు పంచేయడం వంటి వార్తలను మీడియా ముందుకు తెస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈసారి తన ఢిల్లీ పర్యటన లోక్సభ్ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహ కార్యక్రమం కోసమేనని చెప్పారు. ‘‘గతంలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీలుగా ఉండటం, ఓం బిర్లాతో వ్యక్తిగత పరిచయం ఉండటంతో వివాహానికి రావాలని కోరారు. అందుకే ఢిల్లీకి వెళ్తున్నాం. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం లేదు. వివాహానికి హాజరై.. అనంతరం మంగళవారం తెలంగాణ ఎంపీలతో సమావేశమై పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చిస్తాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇవ్వాల్సిన అనుమతుల మీద కేంద్ర మంత్రులు, ప్రధానితోపాటు లోక్ సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను ఆ మీటింగ్‌లో డిస్కస్ చేస్తం. ప్రధానంగా ఎయిర్పోర్ట్, మెట్రో, సాగునీటి కేటాయింపుల అంశాలు కేంద్రం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. మంగళవారం ఎవరైనా కేంద్ర మంత్రులు అందుబాటులో ఉంటే వారిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తం. ఈ ఢిల్లీ పర్యటన ఇంతే” అని సీఎం స్పష్టం చేశారు.
‘‘పదేండ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన మీరు(బీఆర్ఎస్ నేతలు) కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి రాష్ట్రానికి నిధులు తేలేకపోయారు. దీని వల్ల తెలంగాణకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. మన రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో పర్యటించాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి.. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. అదేమీ బీజేపీ ట్రెజరరీ నుంచి ఇవ్వడం లేదు కదా! కేంద్ర ప్రభుత్వ ట్రెజరరీ నుంచి ఇవ్వాలి. ఇది మన రాష్ట్ర హక్కు. రాజకీయ పక్షపాతంతో అన్యాయం చేసినా, నిర్లక్ష్యంగా ఉన్నా ప్రస్తావించడానికి కేంద్రాన్ని కలవాలి. ఫామ్‌హౌస్‌లో పడుకుంటే నిధులు, అనుమతులు రావు. అందుకే ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తాం. తప్పకుండా రాబట్టుకోవాల్సిన నిధులు రాబట్టుకుంటాం. అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది” అని ఆయన వివరించారు.
పార్లమెంట్ సీట్లలో రాహుల్‌కు జై కొట్టారు
దేశంలో రెండు లోక్‌సభ ఎన్నికలు జరిగాయని.. అవి ప్రధానమంత్రి ఎన్నికకు సంబంధించినవని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘కేరళ వయనాడ్‌లో ఒకటి, రెండోది మహారాష్ట్ర నాందేడ్లోనిది. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వాన్ని జనం బలపర్చారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు మహాయుతికి వేశారు... కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓటు రాహుల్ గాంధీకి వేశారు. నరేంద్రమోదీ నాయకత్వాన్ని , ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్న కిషన్ రెడ్డిని మహారాష్ట్ర ప్రజలు ఛీ కొట్టారు.
కేరళలో రాహుల్‌గాంధీకి వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ప్రియాంకగాంధీకి వచ్చింది. మోదీ నాయకత్వాన్ని కేరళ తిరస్కరించడమే కాకుండామహారాష్ట్రలోని నాందేడ్ ప్రజలు కూడా తిరస్కరించారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కిషన్ రెడ్డికి లేకపోవడం, ఆయనను కేంద్రమంత్రిని చేయడం దురదృష్టం” అని విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉందని, వాళ్ల ప్రభుత్వమే మళ్లీ వచ్చిందని.. జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉంటే అదే మళ్లీ అధికారంలోకి వచ్చిందని.. ఇందులో సంబురాలు చేసుకోవాల్సింది ఏముందని కిషన్‌రెడ్డిని ప్రశ్నించారు. బ్యాలెట్ మీద ఎన్నికలు జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమని.. ఈవీఎంలు కాదని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మందుల శామ్యూల్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అదానీ ఒప్పందాలపై విచారణకు సిద్ధమా?
‘‘బీఆర్ఎస్ వాళ్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదానీ గ్రూప్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నరు. ఒక ఒప్పందాన్ని రద్దు చేయాలంటే న్యాయపరమైన సలహాలు కూడా తీసుకోవాలి. యూనిలాటరల్గా ఏది రద్దు చేసినా.. ఆ సంస్థలు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో అదానీకి కాంట్రాక్టులు ఇచ్చింది.. భూములు కేటాయించిందీ.. అదానీతో ఫ్లైట్‌లో ఆడంబరంగా ప్రయాణాలు చేసిందీ వాళ్లు(బీఆర్ఎస్ నేతలు). అదానీ పక్కన కేసీఆర్ నిలబడి వంగి వంగి దండాలు పెట్టిండు. నేనెప్పుడూ అట్ల చేయలే. అదానీ సంకలో దూరింది కేటీఆరే. అలాంటి ప్రబుద్ధుడు కేటీఆర్ నా గురించి మాట్లాడటమేంది? అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి వస్తే..మీ (బీఆర్ఎస్ వాళ్ల) మీద కేసు కూడా పెట్టాల్సి వస్తది. పదేండ్లలో మీరే కదా ఒప్పందాలు చేసుకున్నది. విచారణకు కేటీఆర్ సిద్ధమా?” అని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి నిర్ధిష్టమైన విధివిధానాలు ఉంటాయని, దాని ప్రకారమే చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ నేషనల్ హైవేలు, డేటా సెంటర్లు ఏమేమి అదానీకి ఇచ్చారో లిస్ట్ ఉందని, వాళ్లు ఇచ్చిన వాటికి విచారణకు సిద్ధమేనా? అని ఆయన నిలదీశారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, డిఫెన్స్ యూనిట్, మిసైల్ సెల్ మ్యాన్ఫక్చరింగ్, మూడు నేషనల్ హైవేస్ ప్రాజెక్టులు, 750 కేవీ సబ్ స్టేషన్లైన్లను అదానీకి గత బీఆర్ఎస్ సర్కారే ఇచ్చిందని, ఈ ప్రాజెక్టులన్నీ ఇచ్చినందుకు కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాల్నా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి
అదానీకి గత బీఆర్ఎస్ సర్కారే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, డిఫెన్స్ యూనిట్, మిసైల్ సెల్ మాన్యూఫాక్చరింగ్, మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులు, 750 కేవీ సబ్ స్టేషన్ లైన్లను ఇచ్చింది. ఇన్నిన్ని ప్రాజెక్టులు అదానీకి ఇచ్చి.. ఆయనతో అంటకాగి.. కమీషన్లు మెక్కి.. అలాంటిది ఇప్పుడు మాపైనే ఆరోపణలు చేస్తరా? ఈ ప్రాజెక్టులన్నీ ఇచ్చినందుకు కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాల్నా? అదానీని కేసీఆర్ కలిసి వంగి వంగి దండాలు పెట్టిండు. నేను అట్ల ఎప్పుడు చేయలే. అధికారం పోయిందన్న అసహనంతో కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడ్తున్నడు. వాళ్లకు 2023 లో అధికారం పోయింది.. 2024 జూన్‌లో డిపాజిట్లు పోయినయ్.. ఇప్పుడు మెదడు కూడా పోయింది. మేం జరిపిస్తున్న విచారణలు అన్నీ వాళ్లు కోరుకున్నవే. జైల్లో పెట్టాలని కోరుకుంటున్నది కూడా వాళ్లే. సైకో రాముకు ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావడం లేదు.
అట్లయితే.. ముందు ఆయన చెల్లెలే ఉంటది
‘‘విచారణ అనగానే.. ఇగో చూసిన్రా నా మీద కేసులు పెడుతున్నరని కేటీఆర్ ఒగల ఏడుపులు ఏడుస్తుంటడు. ఇంకోసారి.. పెట్టుర్రి జైలుకు పోతా అంటడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా.. జైల్లో కూసుందామా అనుకుంటున్నడు. జైలుకు పోయినోళ్లందరూ సీఎం అయిన్రని ఎక్కడ్నో విన్న. ఆ లెక్కల చూస్తే.. వాళ్ల కుటుంబంలో ముందుగాల వాళ్ల చెల్లెలు జైలుకు పోయొచ్చింది కదా? అట్ల కూడా ఈయనకు (కేటీఆర్) అవకాశం లేదు. కేసీఆర్ ఫ్యామిలీలో ఆ చాన్స్ కూడా కేటీఆర్ చెల్లెలు కొట్టేసింది. ఆయన చిల్లర ఆలోచనలు మానుకోవాలి. పదేండ్లు మంత్రిగా చేసినోడు... కొంచెమైనా ఆలోచన చేయాలి. అట్ల కాకుండా అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నడు. ఆయన పక్కనున్నోళ్లే ఫోన్ చేసి ఏదేదో మాట్లాడ్తున్నడని అంటున్నరు” అని కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
అదానీ గ్రూప్‌కు రాసిన లేఖ సారాంశం ఇదే
‘‘18.10.2024 నాటి మీ లేఖ ద్వారా అదానీ ఫౌండేషన్ తరఫున యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు కేటాయించినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విశ్వ విద్యాలయం సెక్షన్ 80జీ కింద ఐటీ మిన హాయింపును పొందాం. అయినా నిధుల కోసం మేము ఇప్పటివరకు దాతలలో ఎవరినీ అడగలేదు. ఈ మినహాయింపు ఉత్తర్వులు ఇటీవలే వచ్చినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు, తలెత్తుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని నిధులు తీసుకోవద్దని సీఎం నన్ను ఆదేశించారు” అని అదానీ గ్రూప్‌కు స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ లేఖ రాశారు.
కేటీఆర్ కడుపు మంట ఎందుకో తెలుసు
‘‘మీ కడుపు మంట, దు:ఖం మాకు తెలుసు. మీరు పెడుతున్న కాకిగోల మేం పట్టించుకోం. మీలాంటి వాళ్లు అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది. మా కార్యకర్తలను పదేండ్లు వేధించి, కేసులు పెట్టిన్రు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ డెవలప్మెంట్ జరుగుతుంటే అడ్డం పడాలని చూస్తున్నరు” అని కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాభి వృద్ధికి అడ్డంపడాలని చూస్తే అప్పుడప్పుడు కోపం కూడా వస్తుందని, కానీ ఇవన్నీ ప్రదర్శిం చాల్సిన సమయం కాదని, ఏకాగ్రతతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత ప్రజలు తమకు ఇచ్చారని, అదే బాటలో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.