హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి మూడుసార్లు ప్రధాని మోదీని కలిసినా లాభం లేకుండా పోయిందని, తెలంగాణ మంత్రులు 18 సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. పెద్దన్న పాత్ర పోషించాలని మోదీని పదేపదే కోరానని సీఎం చెప్పారు. వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని కోరారని తెలిపారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని కేంద్రం తీరు పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:-సుప్రీంకోర్టు సంచలన తీర్పు: నీట్ రీఎగ్జామ్ లేదు
తెలంగాణ పదాన్ని పలకడానికి కూడా మనసు ఒప్పలేదని కేంద్రంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల మోదీ మొదటి నుంచి వివక్ష చూపారని, విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు కేటాయించారని సీఎం చెప్పారు. తెలంగాణకు నిధులిచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన నిలదీశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని ప్రశ్నించారు. ములుగులో గిరిజన వర్సిటీకి నిధులేవని సూటిగా సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
సీఎం రేవంత్ ఇంకా ఏమన్నారంటే..
* తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఆలోచన చేయడం లేదు
* కేంద్ర బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్లా ఉంది
* మెట్రోకు నిధుల్లేవు.. ఐటీ కారిడార్ ఊసే లేదు
* అమరావతికి వేల కోట్లు ఇస్తరు.. మెట్రోకు ఇవ్వరా..?
* ఈ బడ్జెట్ క్విడ్ ప్రోకోలా ఉంది
* పోలవరానికి వేలకోట్లు ఇచ్చినప్పుడు పాలమూరు ఏం పాపం చేసింది..?
* విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకివ్వలేదు?
* సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ బీజేపీ బోగస్ నినాదం
* 35 శాతం ఓట్లు, 8 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకు ఇచ్చేది ఇదేనా?
* తెలంగాణ ప్రజలకు బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలి
* కుర్చీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
* అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం వివక్షపై చర్చిస్తాం
* కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి
* కిషన్ రెడ్డి, సంజయ్ బానిసలుగా కాకుండా పౌరులుగా ఆలోచించాలి
* తెలంగాణ నిధుల కోసం 17 మంది ఎంపీలు కలిసి కొట్లాడుదాం