ఐదు రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు.. డేట్స్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్

ఐదు రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు.. డేట్స్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్

హైదరాబాద్: ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి మరో రెండు గ్యారెంటీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం అమలుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సీఎం విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

మార్చి మొదటి వారం నుంచి  విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ. 500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం అధికారులకు సూచించారు.  ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా.. ఏజెన్సీలకు చెల్లించాలా..? అందుకు ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై సివిల్ సప్లయిస్, ఆర్థిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఎలాగైనా సరే లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేటట్లు చూడాలని, ప్రజలకు అనువైన విధానాన్నిఅనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని  సూచించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.