![ఒకే దేశం ఒకే ఎలక్షన్ వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ: సీఎం రేవంత్](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-cm-revanth-reddy-said-pm-modis-agenda-is-one-party-one-person_u5lmb6Iwq1.jpg)
- దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు
- కుటుంబ నియంత్రణ, మెరుగైన సంక్షేమ
- కార్యక్రమాలు చేపట్టినందుకు శిక్షిస్తరా?
- జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల
- విభజన కరెక్ట్ కాదు.. దీన్ని దక్షిణాది
- రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి
- మూసీకి పునర్వైభవం తీసుకొస్తం
- కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
- ఫిబ్రవరి 4 ‘తెలంగాణ సామాజిక
- న్యాయ దినోత్సవం’ అని ప్రకటన
- పదేండ్లలో బీఆర్ఎస్ చేసిందేందని ప్రశ్న
- కేరళలో ‘మాతృభూమి ఇంటర్నేషనల్
- ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సదస్సుకు హాజరు
హైదరాబాద్ , వెలుగు: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘దశాబ్దాలపాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను దక్షిణాది రాష్ట్రాలు అమలు చేస్తు న్నాయి. అలాంటి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించాలని కేంద్రం చూస్తున్నది. అందులో భాగంగానే జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనుకుంటున్నది. కేంద్రం తీరును దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలి” అని పిలుపునిచ్చారు. ‘ఒకే దేశం.. ఒకే ఎలక్షన్’ అనేది ‘ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ’ విధానమని ఆయన విమర్శించారు. ఇదే ప్రధాని నరేంద్ర మోదీ రహస్య ఎజెండా అని ఆయన ఆరోపించారు. కేరళలోని తిరువనంతపురంలో మలయాళీ దినపత్రిక మాతృభూమి ఆదివారం ఏర్పాటు చేసిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదు.. అది తెలంగాణ ప్రజలందరి స్వప్నం. తెలంగాణను భారత దేశంలో నే కాదు ప్రపంచంలోనే అత్యుత్తుమంగా నిలపాలని మేం ఆకాంక్షిస్తున్నం” అని పేర్కొన్నారు.
జనాభా ప్రకారం వనరులు..
సమగ్ర కులగణన సర్వే చేసిన తొలి రాష్ట్రంతెలంగాణ అని, దాన్ని అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ తెలిపారు. జనాభా దామాషా ప్రాతిపదికన తాము వనరులు సమకూర్చుతామన్నారు. వర్గీకరణ కోసం 30 ఏండ్లుగా మాదిగ సోదరులు పోరాడుతున్నారని చెప్పారు. 2025 ఫిబ్రవరి 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వర్గీకరణ కోసం తీర్మానం చేశామని.. ఇక నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా జరుపుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సుపరిపాలన ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుందనేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహరణ అని రేవంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గ్లోబల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినియోగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. తలసరి ఆదాయంలోనూ ప్రథమ స్థానంలో ఉన్నామని వివరించారు. ‘‘తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకూడదా..? తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయితే అది భారతదేశ వృద్ధికి ప్రయోజనం కాదా..? ” అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని.. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని మండిపడ్డారు.
మూసీ కనుమరుగయ్యే స్థితికి చేరింది
హైదరాబాద్ పర్యావరణ సుస్థిరత కోసం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మూసా, ఈసా నదుల కలయికే మూసీ. యాభై ఏండ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కి మూసీ కనుమరుగయ్యే స్థితికి చేరింది. మా ప్రభుత్వం మూసీకి పూర్వ వైభవం తేవాలనుకుంటున్నది. గోదావరి నీటిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మార్చాలనుకుంటున్నం. అక్కడే 200 ఎకరాల్లో గాంధీ సరోవర్‌ను నిర్మించాలనుకుంటున్నం” అని వెల్లడించారు. డ్రై పోర్ట్ నిర్మించాలనుకుంటున్నామని, దాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని సీ పోర్ట్ కు ప్రత్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా కలుపుతామని తెలిపారు. హైదరాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుందని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్వే లైను నిర్మించబోతున్నామన్నారు. ఈ రెండింటిని రేడియల్ రోడ్ల ద్వారా కలుపుతామని తెలిపారు. ‘‘తెలంగాణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా డెవలప్చేస్తున్నాం. 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాలో 1.2 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉంది.. చార్మినార్, బిర్యానీ, ముత్యాలకు హైదరాబాద్ ప్రసిద్ధి. ఓఆర్ఆర్ పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెకార్ట్స్‌తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేస్తాం” అని ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తాము పలు కార్యక్రమాలు చేపడ్తున్నామన్నారు. ‘‘దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ఉండాలనుకుంటున్నం. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నం.. ఇది భారతదేశంలోని పూర్తి గ్రీన్ , పరిశుభ్రమైన, అత్యుత్తమమైన నగరంగా ఉంటుంది. అలాగే ఇది మొట్టమొదటి నెట్ జీరో సిటీ అవుతుంది. ఫ్యూచర్ సిటీలో మేం ఏఐ సిటీని నిర్మిస్తున్నం. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ చేపడ్తున్నం” అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు బీఆర్ఎస్ ఏమి చేయలేదు
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని.. 60 ఏండ్ల కలను నెరవేర్చినందున తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని ఎంతగానో అభిమానిస్తున్నారని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసింది ఏమీ లేదు. ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారు తప్ప వాటిని నెరవేర్చలేదు” అని విమర్శించారు. ‘‘ఈ ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో నేను పాల్గొన్నాను. రూ.1,82,000 కోట్లకుపైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకు రాగలిగాం. గతేడాది రూ.40 వేల పెట్టుబడులు వచ్చాయి.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సాధించలేకపో యింది” అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు అన్ని వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వడానికి ఇదే సరైన సమయం. కేంద్ర ప్రభుత్వ విధానాల ఆధారంగానే మనం కుటుంబ నియంత్రణ పాటించాం.. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే మనకు (దక్షిణాది రాష్ట్రాలు) అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలనూ కోల్పోతాం. రాష్ట్రాలను స్థానిక సంస్థలుగా మార్చాలని కేంద్రం భావిస్తున్నది.
- సీఎం రేవంత్‌రెడ్డి