
డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి . సీఎం రేవంత్ తో మార్చి 13న ఢిల్లీలో తమిళనాడు మంత్రి కెఎన్ నెహ్రూ, డీఎంకే ఎంపీ కనిమొళి పలువురు నేతలు భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. డీలిమిటేషన్ కారణంగా జరిగే నష్టం గురించి చర్చించామన్నారు. డీలిమిటేషన్ వివాదం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నోరు విప్పాలన్నారు. దక్షిణాది తరపున కేంద్రంలో కిషన్ రెడ్డి గళం వినిపించాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రను తిప్పికొట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలోని అన్ని పార్టీలతో డీలిమిటేషన్ పై చర్చిస్తామని చెప్పారు.
ALSO READ : బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మాటల యుద్ధంతో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
డీలిమిటేషన్ పై మార్చి 22న చెన్నైలో ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ లో డీలిమిటేషన్ పై అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన తర్వాత యాక్షన్ ప్లాన్ ఉంటుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ చేపట్టబోయే కార్యాచరణకు మద్దతు ఇస్తాం. పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని ఆల్ పార్టీ మీటింగ్ కు అటెండ్ అవుతా. ఇది పార్టీలకతీతంగా స్పందించాల్సిన సందర్భం. ఇందులో బీజేపీ దక్షిణాది విభాగం కూడా ఉంటుంది. దక్షిణాదికి జరుగుతున్న నష్టం గురించి రాజకీయాలకు అతీతంగా చర్చించాల్సిన అవసరం ఉంది అని రేవంత్ అన్నారు.