కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా50శాతానికి పెంచండి: సీఎం రేవంత్రెడ్డి

కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా50శాతానికి పెంచండి: సీఎం రేవంత్రెడ్డి
  • రుణాల రీస్ట్రక్చర్​కు అవకాశమివ్వండి.. లేదంటే ఆర్థిక సాయమందించండి
  • కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి పెంచండి
  • 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
  • భారీగా అప్పులు చేసిన గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం 
  • రూ. 6.85 లక్షల కోట్లకు పెరిగిన రుణ భారం
  • బలమైన పునాదులు ఉన్నప్పటికీ ఆర్థికంగా సవాళ్లు
  • తెలంగాణ యంగెస్ట్, ఫ్యూచర్ స్టేట్
  • రుణ సమస్యకు పరిష్కారం చూపాలని వినతి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణపై అప్పుల భారం పెరిగిందని, ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్నదని 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, లేదంటే అదనంగా ఆర్థిక సాయమందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్​ పనగరియా, సభ్యులతో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణకు బలమైన పునాదులు ఉన్నప్పటికీ, అప్పుల కారణంగా ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని చెప్పారు. ‘‘గత ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అప్పుల భారం రూ.6.85 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో బడ్జెట్, బడ్జెటేతర రుణాలు ఉన్నాయి. రాష్ట్ర ఆదాయంలో అధిక శాతం రుణాల చెల్లింపులకే పోతున్నది. రుణాలు, వడ్డీల చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించుకునేందుకు తగిన సాయం, మద్దతు ఇవ్వాలి” అని కోరారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్, ఫ్యూచర్ స్టేట్‌‌ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. ‘‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 50 శాతానికి పెంచాలి. ఇది అన్ని రాష్ట్రాల తరఫున చేస్తున్న డిమాండ్. దీన్ని నెరవేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలని ప్రధాని మోదీ పెట్టుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తాం.

అలాగే మేం తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. తెలంగాణకు తగినంత సాయమందించండి. భారత్ ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యతను నేరవేరుస్తాం” అని తెలిపారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు ఉపయోగపడతాయని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు.