బీఆర్ఎస్ హయాంలోని సర్వేకు చట్టబద్ధత లేదు : సీఎం రేవంత్​

బీఆర్ఎస్ హయాంలోని సర్వేకు చట్టబద్ధత లేదు : సీఎం రేవంత్​
  • అది ఓ కుటుంబం కోసం చేసుకున్న సర్వే: సీఎం రేవంత్​
  • సమగ్ర కుటుంబ సర్వేను 9 ఏండ్లు ఎందుకు బయటపెట్టలే?
  • లిమ్కా బుక్కోళ్లకు వివరాలిచ్చి.. అసెంబ్లీలో మాత్రం పెట్టలేదు
  • -స్వార్థ ప్రయోజనాల కోసం కల్వకుంట్ల కుటుంబం డేటాను దాచుకున్నది
  • తాము చేసిన కుల గణన సర్వే లెక్కలే ఫైనల్ అని వెల్లడి
  • మేం చేసిన సమగ్ర సర్వే ప్రభుత్వ డాక్యుమెంటే: కేటీఆర్​ 
  • అసెంబ్లీలో సీఎం రేవంత్​రెడ్డి వర్సెస్​ కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్​ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేయించి.. ఆ నివేదికను ఇన్నాళ్లూ ఎందుకు బయటపెట్టలేదని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. 9 ఏండ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు బయటపెడ్తున్నారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ను నిలదీశారు.  ‘‘సమగ్ర సర్వే నివేదికను గత ప్రభుత్వం మంత్రి వర్గంలో, అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? అది ఒక కుటుంబం కోసం చేసుకున్న సర్వే. వాళ్ల రాజకీయ అవసరాల కోసం దానిని వాడుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు. ఇప్పుడు కులగణన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3.70 కోట్లు.

కేబినెట్​ఆమోదం లేని సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి చట్టబద్ధత లేదు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం  రేవంత్​రెడ్డి,  మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ మధ్య వాడివేడి చర్చ  జరిగింది. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే పాయల్​ శంకర్  పదే పదే 2014 సర్వే ప్రకారం అంటూ మాట్లాడటంపై సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్ ​అయ్యారు. పాయల్​ శంకర్​తో ‘అపోహల సంఘం’ అలా మాట్లాడిస్తున్నదని విమర్శించారు.

సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదని సూచించారు. తమ సర్వే ప్రకారం 15 శాతం ఓసీలు ఉంటే,  2014  సర్వే ప్రకారం ఓసీలు 21శాతం అంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ జనాభా 51 శాతం అని, తాము చేసిన సర్వే ప్రకారం బీసీ జనాభా 56 శాతంగా ఉందన్నారు. సర్వేపై అపోహలు సృష్టించేలా ఎలా మాట్లాడుతారని సీఎం మండిపడ్డారు. ‘మొదటినుంచీ ప్రతీ పదేండ్లకు జనాభా లెక్కలు చేస్తూ వచ్చారు. 

కానీ  2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఈ రోజు వరకు జనాభా లెక్కలు చేయలేదు. 70 ఏండ్లు కొనసాగిన జనాభా లెక్కల ప్రక్రియ మోదీ ప్రధాని అయ్యాక ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే బలహీనవర్గాలకు వారి హక్కులు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు’’ అని సీఎం విమర్శించారు. 2024లో చేపట్టిన ఈ లెక్కలే తెలంగాణలో అధికారిక లెక్కలని స్పష్టం చేశారు. 

సమగ్ర సర్వేనూ ఏ సైట్​లోనూ పెట్టలే

బీఆర్ఎస్​ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఏ ప్రభుత్వ వెబ్​సైట్​లోనూ పెట్టలేదని  సీఎం రేవంత్​ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలకు ఎన్ఐసీ ఓనర్​ అని, ఆ వెబ్​సైట్​లోనూ వివరాలు లేవని తెలిపారు. టీజీ ఆన్ లైన్​ సైట్​లోనూ ఇవి లేవని అన్నారు. కేవలం ఎంసీఆర్​హెచ్ఆర్​డీ వెబ్​సైట్​లోనే ఆ వివరాలు పెట్టారని చెప్పారు. అలాంటి డాక్యుమెంట్ కు​ ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. అసలు సర్వేలో పాల్గొనని నేతలకు స్పీకర్​ శిక్ష వేయాలని, వారికి సభలో మాట్లాడే అర్హత లేదని, మైక్​ కట్​ చేయాలని కోరారు. 

సమగ్ర కుటుంబ సర్వేని కేవలం రికార్డుల కోసమే చేసుకున్నట్టుందని తెలిపారు. లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ కోసం ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేశారని, లిమ్కా బుక్​ వాళ్లకు వివరాలిచ్చిన నాటి బీఆర్ఎస్​ సర్కారు అసెంబ్లీలో మాత్రం పెట్టలేదని మండిపడ్డారు. పబ్లిక్​ డొమెయిన్​లోనూ పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిమ్కా బుక్​ ఆఫ్​ వాళ్లే బీసీలకు న్యాయం చేస్తారా? అని  విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం దగ్గరే వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమగ్ర కుటుంబ సర్వే డేటాను దాచి పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సమగ్ర సర్వేను వెబ్​సైట్​లో పెట్టినం: కేటీఆర్​

 తమ​హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ప్రభుత్వ డాక్యుమెంటేనని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఆ వివరాలన్నింటినీ ఆనాడే వెబ్​సైట్​లో పొందుపరిచామని చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్​ ప్రకారం కుల గణనకు చట్టబద్ధత కల్పించి అమలు చేస్తారేమో అనుకున్నామని, కానీ, అలా జరగలేదని మండిపడ్డారు. మంగళవారం కులగణన సర్వే వివరాలపై చ ర్చ సందర్భంగా  అసెంబ్లీలో కేటీఆర్​మాట్లాడారు. తాము చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలను కూడా కలుపుకొని బీసీల సంఖ్య 61 శాతమన్నారు. బీసీలు 51 శాతమైతే.. ముస్లింలు మరో 10 శాతం ఉన్నారని చెప్పారు.

 కానీ, కాంగ్రెస్​ కుల గణన సర్వేలో బీసీల సంఖ్య తగ్గిందని, 46 శాతానికి ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. కుల గణన రిపోర్ట్​ను తగులబెట్టాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీనే డిమాండ్​ చేస్తున్నారని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పిస్తుందని భావించామని, కానీ, అలా చేయలేదని కేటీఆర్​ విమర్శించారు. కాంగ్రెస్​ లెక్కల ప్రకారం 56 శాతం ఉన్న బీసీలకు బీసీ సబ్​ ప్లాన్​ తీసుకొస్తారని అనుకున్నామని, అవేమీ చేయకుండా ఒక స్టేట్​మెంట్​ ఇచ్చి ఇదే చరిత్రాత్మకమంటే బీసీలు ఒప్పుకోబోరని తెలిపారు. 

బీఆర్ఎస్​ వాకౌట్​

బలహీనవర్గాలకు కాంగ్రెస్​ సర్కారు ద్రోహం చేసిందని బీఆర్ఎస్​ నేతలు మండిపడ్డారు.  నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్​ సభ్యులు వాకౌట్​ చేశారు. బీసీల సంఖ్యను 5 శాతం తగ్గించి గొంతు కోశారని అన్నారు. ఇది ప్రభుత్వ కుట్రేనని, అందుకే వాకౌట్​ చేస్తున్నామని కేటీఆర్​తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించిన తీరును రాష్ట్రంలోని బలహీనవర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వారి వాదనను, బాధను అసెంబ్లీలో తెలుపుదామంటే ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ సభ్యులు  వాకౌట్ చేసినా సభలోనే కవిత

హైదరాబాద్​సిటీ, వెలుగు: శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టి బీసీ సమగ్ర కుల గణన నివేదికను బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సర్వేలో ఎన్నో తప్పులు ఉన్నాయని మండిపడ్డారు. రీ సర్వే చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ మేరకు నివేదికను ఆమోదించే సమయంలో బీఆర్ఎస్​ సభ్యులు మధుసూదనాచారి, గోరటి వెంకన్న, శేరి సుభాశ్ రెడ్డి, బండ ప్రకాశ్, ఎల్.రమణ, మహమూద్​అలీ, దేశపతి శ్రీనివాస్ సభను వాకౌట్ చేశారు. కానీ.. కవిత మాత్రం మండలిలోనే కూర్చుండిపోయారు. 

ఆమె వాకౌట్ చేయకపోవడంపై ఇటు మండలి, అటు అసెంబ్లీలో చర్చ జరిగింది. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా సభ్యులందరూ వాకౌట్ చేస్తే.. కవిత మాత్రం తన సీట్లోనే కూర్చుని ఉండటంపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లపై కవిత సభలు, సమావేశాలు నిర్వహిస్తూ యాక్టివ్​గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వాకౌట్ చేయకపోవడం రాజకీయ వ్యూహంగానే పలువురు భావిస్తున్నారు.

ఆ డేటా ఇవ్వం

కులగణన సర్వే వివరాలను 4 వాల్యూమ్​లుగా తయారు చేశామని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. తొలి 3 వాల్యూమ్​లలో సర్వే చేసిన విధానం, ఏ కులం వాళ్లు ఎంత మంది ఉన్నారు? వంటి వివరాలను పొందుపరిచామని తెలిపారు. ఆ 3 వాల్యూమ్​లను పబ్లిక్​ డొమెయిన్​లో పెడతామని చెప్పారు. అయితే, నాలుగో వాల్యూమ్​ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టబో మన్నారు. నాలుగో వాల్యూమ్​లో అందరి వ్యక్తిగత వివరాలుంటాయని, డేటా ప్రైవసీ యాక్ట్​ ప్రకారం వాటిని బహిర్గత పరిచేందుకు అవకాశం లేదని చెప్పారు.

బయటపెడితే అది పెద్ద క్రిమినల్​ చర్య అవుతుందని పేర్కొన్నారు. పక్కా సమాచారాన్ని సేకరించామని, ఎవరికీ అన్యాయం చేయలేదని చెప్పారు. జనాభా తగ్గిందని ప్రతిపక్షాలు అనడం సరికాదని అన్నారు. ఈ 14 ఏండ్లలో జనాభా కేవలం స్టెబిలైజ్​ అయింద న్నారు.

జనన, మరణాల రేటు ఆధారంగా జనాభాలో స్థిరీకరణ వచ్చిందని చెప్పారు. దీంతో ఈ 14 ఏండ్లలో జనాభా పెరుగుదల కేవలం 1.2 శాతమే నమోదైందని వివరించా రు. కాగా, తాను నచ్చలేదని వివరాలు ఇవ్వకపోతే ఎవరికి నష్టమని పేర్కొ న్నారు. ‘‘రేవంత్​ రెడ్డి జుట్టు నచ్చలేదు. రేవంత్​ రెడ్డి ముఖం నచ్చలేదు. రేవంత్​ రెడ్డి నచ్చలేదు అని సర్వేలో పాల్గొన లేదు. ఈ సర్వే ఏమైనా రేవంత్​ రెడ్డి కోసం చేస్తున్నారా’’ అని  మండిపడ్డారు.