ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది..పండవెట్టి తొక్కుతం : సీఎం రేవంత్ రెడ్డి

ఎవడ్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది..పండవెట్టి తొక్కుతం :  సీఎం రేవంత్  రెడ్డి
  • కూలిపోవడానికి ఇది కాళేశ్వరం 
  • ప్రాజెక్టు కాదు.. ప్రజాప్రభుత్వం
  • ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ ఫైర్​
  • -ఇంకా కేసీఆర్​ సీఎం అయితడని చెప్తే మూతిపండ్లు రాల్తయ్​
  • ఈ జన్మలో మళ్లీ ముఖ్యమంత్రి కాదు కదా.. మంత్రి కూడా కాలేడు 
  • కోటి ఎకరాలకు నీళ్లిస్తానని నమ్మించి లక్షల కోట్లు మింగిండు
  • త్వరలోనే రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు
  • 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తం
  • ప్రతి తండాకు రోడ్లు, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని హామీ 
  • ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్, ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన 
  • నాగోబా ఆలయంలో పూజలు, ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళి

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా కామెంట్లు చేస్తే పండవెట్టి తొక్కుతమని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు. ‘‘మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్​ ముఖ్యమంత్రి అయితడని, ప్రభుత్వం పడిపోతదని కొందరంటున్నరు. నీ అయ్య.. ఎవడ్రా పడగొట్టెటోడు. పడగొడుతార్రా.. ప్రజలు చూసుకుంట ఊరుకుంటరా? ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఊర్లల్ల యాప చెట్టుకు కోదండం వేసి కొట్టున్రి. లాగులల్ల తొండలు ఇడువున్రి. ఇది ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం. వాడు అనుకుంటున్నడు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తదని. నువ్వు దోపిడీకి పాల్పడ్డవు గావట్టి ఆ కాళేశ్వరం గాలొస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా.. నీ ఖాన్​దాన్ ​మొత్తం వచ్చినా బోర్లబొక్కల పండవెట్టి తొక్కుతం. ఎవడన్నా ఈ ప్రభుత్వం పడ్తదనో, కేసీఆర్​ సీఎం అయితడనో చెప్తే మూతి పండ్లు రాలగొడ్తం” అని బీఆర్ఎస్ నేతలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్​ జిల్లా కేస్లాపూర్, ఇంద్రవెల్లిలో సీఎం పర్యటించారు. మధ్యాహ్నం 2:50 గంటలకు హెలికాప్టర్​లో కేస్లాపూర్​చేరుకున్న రేవంత్.. మొదట నాగోబా ఆలయంలో పూజలు చేసి, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం సాయంత్రం 4:35 గంటలకు ఇంద్రవెల్లికి చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభ వేదికగా లోక్ సభ ఎన్నికలకు శంఖం పూరించి మాట్లాడారు. 

ఆనాటి తప్పులను సరిదిద్దుతున్నం.. 

అధికారంలోకి రాగానే ఆదిలాబాద్​ జిల్లాను దత్తత తీసుకుంటానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడి నుంచే అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘నేను పీసీసీ ప్రెసిడెంట్​అయ్యాక 2021 ఆగస్టు 8న ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో ‘దళిత గిరిజన దండోరా’ సభతో కేసీఆర్ ​మీద సమరశంఖం పూరించాను. మీ ఆశీర్వాదం తీసుకుని, గుండెల నిండా మీరిచ్చిన ధైర్యాన్ని నింపుకుని తెలంగాణ మొత్తం చుట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చాను. కల్వకుంట్ల కుటుంబాన్ని బొందపెడుతామని ప్రతినబూని డిసెంబర్​3న ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు” అని చెప్పారు. ‘‘ఇక్కడి మట్టికి గొప్పదనం ఉంది. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంది. తినే తిండిలో, వేసే అడుగులో పోరాట పటిమ ఉంది. ఈ గడ్డ మీద మీ బిడ్డ కుమ్రం భీమ్​జల్, జంగల్, జమీన్​అంటూ పోరాడారు. రాంజీగోండు​ బ్రిటిషర్లకు, రజాకార్లకు వ్యతిరేకంగా కొట్లాడారు. ఈ వీరుల గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర కూడా మొదలవ్వదు” అని అన్నారు. ‘‘1981లో కాంగ్రెస్​పార్టీనే ఆదివాసీ బిడ్డలను పొట్టనపెట్టుకుందని కొంతమంది సన్నాసులు అంటున్నారు. సమైక్య పాలనలో కొందరు నిస్సహాయంగా చేతులు కట్టుకుని కూర్చోవడం వల్లే తప్పు జరిగింది.. దానికి మన్నించండి. ఆనాటి తప్పులను సరిద్దిద్దే బాధ్యత ఇప్పుడు మేం తీసుకున్నాం.  సమైక్య రాష్ర్టంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికే సోనియాగాంధీ తెలంగాణ రాష్ర్టం ఇచ్చారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం” అని రేవంత్​ హామీ ఇచ్చారు.  

పదేండ్లలో తెలంగాణ విధ్వంసం.. 

పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసమైందని రేవంత్ అన్నారు. కేసీఆర్, ఆయన బంధువులు, బీఆర్ఎస్ ​నాయకులు చెరుకు తోటల మీద అడవి పందులు పడ్డట్టు తెలంగాణ పల్లెల మీద పడి దోచుకున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్​రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? కూలిపోతున్న కడెం ప్రాజెక్టుకు రిపేర్లు చేసిన్రా.. సదర్​మాట్​ ప్రాజెక్టు కట్టిన్రా.. గూడేలకు రోడ్లేసిన్రా, మంచినీళ్లు ఇచ్చిన్రా” అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకంలో రూ.40 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్​కు ఎంతసేపు ఫామ్​హౌస్​లు కట్టుకోవాలె.. కొడుకు, బిడ్డకు పదవులు ఇవ్వాలనే ఆలోచనే. నీ బిడ్డను నిజామాబాద్​ ఎంపీగా ప్రజలు బండకేసి కొడితే ఎమ్మెల్సీ ఇచ్చినవ్. నీ కొడుకు, అల్లుడిని మంత్రులు చేసుకున్నవ్. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలియ్యలేదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పదేండ్లు స్టాఫ్​నర్సుల నియామకాలు చేయలేదు. మేము వచ్చిన తర్వాత 7 వేల స్టాఫ్​నర్స్ ఉద్యోగాలు ఇచ్చినం” అని తెలిపారు. 

ఉద్యోగాలిస్తం.. ప్రాజెక్టులు కడ్తం  

గత బీఆర్ఎస్ ​ప్రభుత్వ తీరుతో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని... ఇంటికెళ్లి తల్లిదండ్రులకు ముఖం చూపించలేక అమీర్​పేట, అశోక్​నగర్​ చౌరస్తాల్లో తిరుగుతున్నారని రేవంత్​ఆవేదన వ్యక్తం చేశారు. తామిచ్చిన మాట ప్రకారం ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్​ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ‘‘ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా కాకముందే కొంతమంది ఆరు గ్యారంటీల గురించి విమర్శిస్తున్నారు. హామీలన్నీ తప్పకుండా అమలు చేసి తీరుతాం. త్వరలోనే ప్రియాంకగాంధీ చేతుల మీదుగా లక్షమంది ఆడబిడ్డల సమక్షంలో రూ.500కే గ్యాస్​ సిలిండర్​పథకం ప్రారంభిస్తాం. తెల్ల రేషన్​కార్డు ఉన్న ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందిస్తాం” అని తెలిపారు. కేసీఆర్​కోటి ఎకరాలకు నీళ్లిస్తానని చెప్పి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్ నిర్వాకంతో ఆదిలాబాద్​ జిల్లా రైతులు నీళ్ల కోసం క్రేన్ల తోటి బావులు తవ్వుకోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. కేసీఆర్ వస్తే ప్రభుత్వ హెలికాప్టర్ పెట్టి బావులు చూపిస్తామన్నారు. ‘‘ఆదిలాబాద్ ​జిల్లాలో మంచినీటి పనులకు రూ.60 కోట్లు కేటాయించాం. రూ.10 కోట్లతో బడుల్లో తరగతి గదులు కడుతున్నాం. తుమ్మడిహెట్టి, కుఫ్టి, సదర్మాట్​ప్రాజెక్టులు కట్టి.. కడెం ప్రాజెక్టుకు రిపేర్లు చేసి ఆదిలాబాద్​ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం.  ప్రతి తండాకు, గూడేనికి రోడ్లు వేస్తాం. తాగునీళ్లు ఇస్తాం. పేద పిల్లలు చదువుకోవడానికి స్కూళ్లు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం” అని సీఎం హామీ ఇచ్చారు. 

కేసీఆర్ ​మారుబేరగాడు... 

లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ​ఎంపీలను గెలిపిస్తే.. కేసీఆర్ ​వాళ్లను మోదీకి అమ్ముకుంటాడని రేవంత్​విమర్శించారు. ‘‘మొదటిసారి 12 సీట్లు ఇస్తే అమ్ముకున్నడు. రెండోసారి 9 సీట్లు ఇస్తే అమ్ముకున్నడు. ఈసారి ఒకటో రెండో గెలిస్తే, మళ్లీ మారుబేరగాని లెక్క మోదీకి అమ్ముకుందామని చూస్తున్నడు” అని అన్నారు. దేశంలో ఎన్డీయే, ఇండియా రెండు కూటములే ఉన్నాయని.. కేసీఆర్​ను తమ కూటమిలోకి రానియ్యమని చెప్పారు. ఆ ఇంటి మీది పిట్ట.. ఈ ఇంటి మీద వాలితే కాల్చిపడేస్తామన్నారు.  ‘‘మోదీ ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని మోసం చేసిండు. ప్రధాని ఏనాడూ ఈ ప్రాంతానికి రాలేదు. ఈ జిల్లా నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపురావుకు మంత్రి పదవి ఇయ్యలేదు. అలాంటి మోదీకి ఎందుకు ఓటు వెయ్యాలి” అని ప్రశ్నించారు. ‘‘ఒకరు మతం పేరు మీద, మరొకరు మద్యం పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. మోదీ, కేడీ ఇద్దరూ ఒక్కటై కాంగ్రెస్​ను అడ్డుకోవాలని చూస్తున్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. దేశంలో ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం రావాలంటే.. రాహుల్​గాంధీ ప్రధాన మంత్రి కావాలంటే ఆదిలాబాద్​గడ్డ మీద కాంగ్రెస్​ జెండా ఎగరాలి’’ అని రేవంత్​  పిలుపునిచ్చారు.

ప్రజాసంక్షేమమే ధ్యేయం: భట్టి

‘‘రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించాం. భారీ మెజారిటీతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యాం వచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇంద్రవెల్లి నుంచే అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నం. అమరవీరుల స్తూపం దగ్గర ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ ఇక్కడికి వచ్చి చెప్తున్నం. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మాట ఇస్తున్నం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐటీడీఏలను పునరుద్ధరిస్తామని, ధరణి ద్వారా భూములు కోల్పోయిన వారికి భూములు తిరిగి ఇప్పిస్తామని తెలిపారు.
 

ఆదిలాబాద్ నుంచే అభివృద్ధి: సీతక్క 
 

ఇంద్రవెళ్లి అమరవీరులకు జోహార్.. జై కుమ్రం భీమ్ అంటూ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి సీతక్క ప్రసంగం ప్రారంభించారు. ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల సమరశంఖం పూరించిన రేవంత్.. అభివృద్ధిలో అట్టడుగునున్న ఆదిలాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలుపడానికి ఇక్కడి నుంచే అభివృద్ధి శంఖారావం పూరించడం సంతోషమన్నారు. జిల్లాలోని ఆదివాసీ గూడేల్లోని పేదలకు కూడు, గూడు కల్పించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షానే నిలుస్తుందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర బడ్జెట్​లో 20 శాతం నిధులను కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.

కేసీఆర్​కు గద్దర్ ఉసురు తగిలింది.. 

ప్రగతిభవన్ ​పేరుతో కేసీఆర్​ గడీ నిర్మించుకున్నడు. గద్దర్​ను 3 గంటలు ఎర్రటెండలో నిలబెట్టిండు. ఆ పాపం ఊరికేపోదు. గద్దరన్న ఉసురు తగిలింది కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ బొక్కలు విరిగినయ్. కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిత్యానంద స్వామిలాగా ఏ దీవినో కొనుక్కుని రాజు గానో, లేదంటే ఫామ్​హౌస్​కు సీఎంగానో ప్రకటించుకోవాల్సిందే. అంతేగానీ ఈ జన్మలో మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు కదా.. మంత్రి కూడా కాలేడు. దళిత, గిరిజన, మైనారిటీలను, మహిళలను నిలువుదోపిడీ చేసిన పాపాల భైరవుడు కేసీఆర్.. మళ్లీ పదవి కావాలనడానికి ఆయనకు సిగ్గు లేదా? 
– సీఎం రేవంత్ రెడ్డి