తెలంగాణలో అద్భుత పోరాటంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి సారథ్యం కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని 1967 నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడించి విజయం సాధించిన దాఖలాలు లేవు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని ఓడించినా అప్పడు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రెండు పార్టీలే ఉండేవి. ప్రస్తుతం తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయపార్టీల తరహాలో తమ రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. తెలంగాణ కూడా బహుళ పార్టీల రాష్ట్రంగా మారింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎన్నికల్లో ఎదుర్కోవడం అంత సులభం కాదు. కేసీఆర్ పార్టీని ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక తరచి చూస్తే అనేక అంశాలను మనం గమనించవచ్చు. కేసీఆర్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ విజయం సాధించిందా లేక కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు నమ్మి అధికారాన్ని హస్తగతం చేశారా అనే ప్రశ్న మనకు కలుగుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం లేకపోయినా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం తమ గ్యారంటీలే ఎన్ని
కల్లో విజయాన్ని అందించాయని భావిస్తోంది. కాబట్టి, నిధులు కొరత వెంటాడుతున్నా, హామీల అమలుకు ఎంత ఖర్చయినా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను తప్పక అమలు చేయాల్సిందే.
గ్యారంటీల అమలుకు డెడ్ లైన్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలుచేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా అమలు అవుతున్నది. నెలరోజుల వ్యవధిలో ఎటువంటి సందేహాలు లేకుండా మిగిలిన గ్యారంటీలు కూడా అమలు అయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలకు త్వరలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీల అమలుకు డెడ్‌లైన్‌ను ఎదుర్కొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌పార్టీ విజయపథంలో దూసుకుపోతుందా లేక రాజకీయపరమైన సమస్యలను ఎదుర్కొంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించాలంటే గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలుచేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌పార్టీ ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్నికల్లో రేవంత్ సర్కార్‌ను టార్గెట్ చేసుకుని మాటల యుద్ధానికి దిగుతారు.
గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడ నుంచి ఏవిధంగా తీసుకువస్తారని ప్రశ్నిస్తారు. సుదీర్ఘకాలంపాటు తెలంగాణకు జరిగిన డ్యామేజ్ కారణంగా రాష్ర్టం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, వాస్తవానికి ప్రతి అంశంపై సమీక్ష అనంతరం నాలుగు నెలల తర్వాతే ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంటుంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గ్యారంటీల అమలు చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై నాలుగు నెలలపాటు దృష్టి సారించాలి. నిధులు అందుబాటులోకి వచ్చిన తరువాత కార్యాచరణకు పూనుకోవాలి. 20వ శతాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత, అత్యంత ప్రభావవంతమైన ఆర్థికవేత్తల్లో ఒకరైన జాన్ కీన్స్ చెప్పినట్లు కేవలం స్వల్పకాలిక విషయాలు, హామీల కోసం మాత్రమే ప్రభుత్వం ఆలోచించాలి. కేవలం 4 నెలల ఖర్చు గురించి మాత్రమే సర్కారు ఆలోచించి పరిగణనలోకి తీసుకోవాలి.
పార్లమెంట్ ఎన్నికల సవాల్
త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలు రేవంత్ రెడ్డికి ప్రధాన సవాల్ విసరనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇక నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఓట్లు అడిగేందుకు హామీల అమలుపై ఆధారపడి ఉన్నారు. అయితే ఎంపీ సీట్లు గెలవడానికి కేవలం పథకాలే సరిపోవు. సంక్షేమ పథకాలే కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారు. తెలంగాణాలోని మధ్యతరగతి ప్రజలు పెద్ద ఓటు బ్యాంకు. వారు సంక్షేమ పథకాలను పట్టించుకోరు. ఎందుకంటే వారికి ఏ ఒక్కటీ సక్రమంగా అందలేదు. మధ్యతరగతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. రేవంత్ రెడ్డి మధ్యతరగతి వర్గాలకు కొన్ని "గ్యారంటీలు" వెతకాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మధ్యతరగతి ప్రజలను మరిచిపోయారు. కేసీఆర్ పార్టీకి ఇంకా బలమైన పునాది ఉందని నిరూపించుకోవడానికి పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ కు పెద్ద చాన్స్. కేసీఆర్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో గణనీయంగా ఎంపీలను గెలవడమే కాదు, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించకూడదని ఆశిస్తున్నారు. కేసీఆర్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి తప్ప బీజేపీ కాదు. మరోవైపు మోదీ ప్రధాని అభ్యర్థి కావడంతో కాంగ్రెస్‌కు బీజేపీ పెద్ద సవాలుగా నిలుస్తుంది. మోదీ, ఇతర సీనియర్ బీజేపీ నాయకులు చాలా సుపరిచిత వ్యక్తులు, గత 10 సంవత్సరాలుగా వారు తరచూ తెలంగాణను సందర్శిస్తున్నారు. మోదీకి ఆదరణ ఉందనడంలో సందేహం లేదు. బీజేపీ కచ్చితంగా గట్టి పోటీ ఇవ్వగలదు. జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నేతల కంటే ముఖ్యమంత్రి రేవంత్‌కి ఎక్కువ ఆదరణ ఉంది.
రేవంత్‌కు హైకమాండ్ స్వేచ్ఛనివ్వాలి
తెలుగు రాష్ట్రాల కంటే ఇతర రాష్ట్రాల్లో బీజేపీలోకి బయటి నుంచి వచ్చిన నేతల పట్ల బీజేపీ అధినాయకత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. కానీ, ఇక్కడ రిటైరైన నాయకులకు గొప్ప పదవులు లభిస్తాయి. వాటివల్ల బీజేపీకి ఎన్నికల్లో ఒనగూడే ఉపయోగం ఏమిటనేది ప్రశ్నార్థకం. కేంద్రంలో బలమైన బీజేపీకి ఉన్న ఈ బలహీనతను కాంగ్రెస్ పూర్తిగా ఉపయోగించుకోవాలి. ప్రతి రాజకీయ వ్యూహంలో బలహీనతలు ఉంటాయి. ఊహించని పరిణామాలు జరుగుతాయి. ఒక్కోసారి అన్ని ప్లాన్లు దెబ్బతింటాయి. రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ తమ నీడలో ఉండకుండా నిర్భయంగా పనిచేసేలా పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్‌రెడ్డికి లోక్ సభ ఎన్నికల్లో పూర్తి స్వేచ్ఛనివ్వాలి.
కరిష్మా కోల్పోయిన కేసీఆర్
రేవంత్‌రెడ్డి ప్రధాని అభ్యర్థి కాదు. అది కాంగ్రెస్‌కు పెద్ద సమస్య. కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బీజేపీ వ్యతిరేక పార్టీలే. మరే రాష్ట్రంలోనైనా అయితే కలిసి ఉండేవి. దీనికి ఉదాహరణగా బీజేపీయేతర పార్టీలు ఢిల్లీ, పంజాబ్, బెంగాల్‌లో ఏకమవుతున్నాయి. కానీ , ఢిల్లీలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగవచ్చు . అయితే తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ ఢిల్లీలో అంతగా ఆకర్షణీయమైన నాయకుడిగా లేడు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే బీజేపీ, కేసీఆర్ పార్టీల మధ్య పొత్తు ఉండకపోవచ్చు. బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా కాంగ్రెస్ లబ్ధి పొందాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలహీనపరిచే ఒక ప్రధాన అంశం ఏమిటంటే, కమలం పార్టీ కొత్తగా చేరిన వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం. చాలామంది రాజకీయ ప్రముఖులు బీజేపీలోకి వచ్చినా ఇమడలేక ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీనికి ప్రధాన కారణం బీజేపీలో అంతర్గత పోరుతో పాటు నాయకుల్లో సఖ్యత లేకపోవడం. తెలుగు రాష్ట్రాల్లో పాత బీజేపీ నేతలు కొత్తవారిని అడ్డుకోవడం వల్లే పార్టీలోకి వచ్చినవారు పక్కకు తప్పుకొంటున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.
మోదీ, గవర్నర్‌తో రేవంత్ సఖ్యత
సీఎం రేవంత్ రెడ్డి నెలరోజుల పాలనలో చేసిన మంచి విషయాలను పరిశీలిస్తే గవర్నర్ తమిళిసైతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కూడా సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు. గవర్నర్, ప్రధానితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో వివాదాస్పదంగా వ్యతిరేక ధోరణిలో వ్యవహరించడాన్ని రేవంత్ రెడ్డి గమనించారు. అటువంటి పోరాటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని రేవంత్ రెడ్డి గ్రహించారు. అయితే, గవర్నర్, ప్రధాని మోదీతో ఇకముందు కూడా హుందాగా వ్యవహరించి మంచి సంబంధాలను కొనసాగిస్తారా లేదా అనేది కాలమే చెబుతుంది. రేవంత్ రెడ్డి ప్రధానంగా చేసిన ఒక అద్భుతమైన పని ఏమిటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేలవ పనితీరు, తరచూ పేపర్ల లీకేజీకి పరిష్కారాలు కనుగొనడం. యూపీఎస్సీ చైర్మన్‌తో రేవంత్ రెడ్డి సమావేశమై టీఎస్పీఎస్సీ వైఫల్యాలను పరిష్కరించడానికి దేశంలోనే అత్యుత్తమ సహాయాన్ని కోరిన తీరును ప్రజలు, నిరుద్యోగులు ప్రశంసించారు. సహజంగానే అత్యంత సమర్థుడిగా గుర్తింపుపొందిన రేవంత్ పాలనలో వృత్తి నైపుణ్యాన్ని తీసుకువస్తున్నారు. అంతకుముందు గత ప్రభుత్వంలో పాలనాపరమైన గందరగోళం నెలకొంది.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్