దేశ భవిష్యత్తుకు ఇక్కడ్నుంచే ప్రణాళికలు: : సీఎం రేవంత్​

  • 140 ఏండ్ల తర్వాత కాంగ్రెస్​కు సొంత కార్యాలయం
  • దేశ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించామనేదానికి ఇదే నిదర్శనమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ 140 ఏండ్ల త‌‌‌‌ర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకున్నదని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ఇన్నేండ్లు దేశాన్ని నడిపించిన‌‌‌‌ పార్టీ నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించింద‌‌‌‌నేందుకు ఇదే నిదర్శన‌‌‌‌మ‌‌‌‌ని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ నూత‌‌‌‌న కార్యాల‌‌‌‌యం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే, రాష్ట్రం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  హాజరయ్యారు. 

ఈ ప్రారంభోత్సవం తర్వాత పార్టీ ఆఫీసు బయట సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ కొత్త కార్యాల‌‌‌‌యం దేశ ప్రజ‌‌‌‌ల ప్రయోజ‌‌‌‌నాల‌‌‌‌కు వేదిక కాబోతున్నదని తెలిపారు. దేశ ప్రగతి కోసం ఇక ఇక్కడినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ కార్యాల‌‌‌‌యం నుంచే దేశాన్ని బలమైన, శక్తిమంత‌‌‌‌మైన దేశంగా మార్చడానికి విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశానికి రాజ్యాంగాన్ని అందించింద‌‌‌‌ని చెప్పారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో పేద ప్రజ‌‌‌‌లు.. ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడుతున్నదని అన్నారు. 140 ఏండ్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులు, 40 ఏండ్ల బీజేపీ, ఇత‌‌‌‌ర ప్రాంతీయ పార్టీల ఎకనామికల్​ కండిషన్స్​ ఏ విధంగా ఉన్నాయో దేశ ప్రజ‌‌‌‌లంద‌‌‌‌రికీ తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ నూత‌‌‌‌న కార్యాల‌‌‌‌యం ప్రారంభించుకున్న రోజు దేశ ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు పండుగ రోజ‌‌‌‌ని, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ ఒక అద్భుతమైన కార్యాలయాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్న రోజ‌‌‌‌ని అన్నారు.

ఆర్ఎస్ఎస్​తో సిద్ధాంతపరమైన వైరుధ్యం

తమ అగ్రనేత రాహుల్‌‌‌‌ గాంధీ చెప్పిన‌‌‌‌ట్టు ఆర్ఎస్ఎస్‌‌‌‌తో కాంగ్రెస్ కు సిద్ధాంతపరమైన వైరుధ్యం (ఐడియాలాజికల్​డిఫరెన్సెస్​) ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి​ పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏ పోరాటం చేయ‌‌‌‌లేద‌‌‌‌ని, వారెవ‌‌‌‌రూ ఎలాంటి త్యాగాలు చేయలేద‌‌‌‌ని గుర్తు చేశారు. స్వాతంత్య్రం గురించి ప్రశంసించేందుకు, చెప్పేందుకు వారు సిద్ధంగా లేర‌‌‌‌ని  ఫైర్ అయ్యారు. వాళ్ల వాస్తవ సిద్ధాంతమే అద‌‌‌‌ని, మోహన్ భగవత్ (ఆర్ఎస్ఎస్ స‌‌‌‌ర్ సంఘ‌‌‌‌చాల‌‌‌‌క్‌‌‌‌) అదే చెప్పార‌‌‌‌ని చురకలంటించారు.  స్వాతంత్య్ర పోరాటంతో బీజేపీ లీడర్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్‌‌‌‌, ఆ పార్టీ నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చార‌‌‌‌ని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని రాహుల్ గాంధీ చెప్పార‌‌‌‌ని సీఎం వివ‌‌‌‌రించారు.

స్వాతంత్య్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాల‌‌‌‌ని, ఆ క్రమంలోనే మోహన్ భగవత్‌‌‌‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్‌‌‌‌ గాంధీ డిమాండ్‌‌‌‌ చేశార‌‌‌‌ని తెలిపారు. బీజేపీ వాళ్లు త‌‌‌‌ప్పుడు ఆరోప‌‌‌‌ణ‌‌‌‌లు చేయ‌‌‌‌డంలో దిట్టల‌‌‌‌ని, అందుకే తాము భారతీయ ఝూటా (అబ‌‌‌‌ద్ధాలు) పార్టీ అంటున్నామ‌‌‌‌ని చెప్పారు. బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంలో మోహన్ భగవత్‌‌‌‌తో ఉన్నారా? లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన వారి వెంట ఉన్నారా అనేది చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ విష‌‌‌‌యంలో మోహన్ భగవత్‌‌‌‌పై చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది కూడా దేశ ప్రజలకు స్పష్టం చేయాలని అన్నారు.   

బీఆర్ఎస్​ అంటే బీ 'ఆర్ఎస్ఎస్'​

భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్​కాదని.. బీ ఆర్ఎస్ఎస్​(స్వయం సేవక్​సంఘ్) అని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు. ఆర్ఎస్ఎస్​ ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని, అందుకే బీజేపీని ఫాలో అవుతున్నదని అన్నారు.  దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌‌‌‌కు వ్యతిరేకంగా బీజేపీ చేసే ఆరోప‌‌‌‌ణ‌‌‌‌ల‌‌‌‌నే తెలంగాణ‌‌‌‌లో బీఆర్ఎస్ చేస్తున్నదని ఫైర్​ అయ్యారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేద‌‌‌‌ని తెలిపారు. తెలంగాణ‌‌‌‌లో చట్టం త‌‌‌‌న పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతార‌‌‌‌ని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్‌‌‌‌ కేసులు నమోదు చేశార‌‌‌‌ని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం హ‌‌‌‌యంలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్‌‌‌‌ కార్యాలయాలపై దాడులు చేశార‌‌‌‌ని, తాము అలా చేయ‌‌‌‌డం లేద‌‌‌‌న్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు.