
- బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి , వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తికి వస్తున్నారు. ఈ సందర్భంగా సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్తకోటకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా వనపర్తి నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు. ఇందులో భాగంగా రూ వెయ్యి కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెళ్లి విరుస్తోంది. జిల్లా కేంద్రంలో నలుమూలలా ఎమ్మెల్యే నుంచి చిన్నస్థాయి మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు తమ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి.
ఏర్పాట్ల పరిశీలన...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా శంకుస్థాపనలు చేసే జెడ్పి హై స్కూల్ గ్రౌండ్, అనంతరం బహిరంగ సభ జరిగే పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లను ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ సురభి తో కలిసి పరిశీలించారు. పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్లో సీఎం సభావేదిక, జనాలు కూర్చోవడానికి కుర్చీలు టెంట్లు అన్నింటిని చూసి పలు సూచనలు చేశారు. కాలేజీ వెనుక సీఎం దిగే హెలికాప్టర్ హెలీపాడ్ ను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కేంద్రంలో అడుగడుగునా పోలీసులను మోహరించారు.
సీఎం గతంలో అద్దెకున్న ఇంటి సందర్శన...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అన్నతో కలిసి వనపర్తిలో 43 ఏండ్ల కింద అద్దె కున్న ఇంటిని సందర్శించి ఇంటి యజమానురాలు పార్వతమ్మతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఆమె ఇంటికి రూట్ మ్యాప్ ను క్లియర్ చేశారు. పోలీసులు ఇతర అధికారులు ఆమె ఇంటికి వెళ్లి సీఎం వస్తున్న విషయాన్ని
తెలిపారు.