
- పదేండ్లుగా పెండింగ్ పెట్టారు: సీఎం రేవంత్
- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రెండు సార్లు చర్చలు
- సీఎంఆర్ డెలివరీ టైమ్ పొడిగించండి
- సీఎంతో కలిసి చర్చల్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు పదేండ్లుగా పెండింగ్లో ఉన్న రూ.1,891 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి రెండు దఫాలుగా చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి నివాసంలో ఉదయం, సాయంత్రం ఈ భేటీలు జరిగాయి. ఈ సందర్భంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ సమయం పొడిగించాలని, ‘పీఎం కుసుమ్’ కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని కోరారు. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) 2014–15 ఖరీఫ్ లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పదేండ్లుగా బకాయి ఉన్నందున వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కోరారు.
వీటితో పాటు 2021 జూన్ నుంచి 2022 ఏప్రిల్ వరకు నాన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాలన్నారు. సీఎంఆర్ గడువును నెల రోజులు కాకుండా కనీసం నాలుగు నెలలు పొడిగించాలని, అప్పుడే సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని కేంద్ర మంత్రికి వివరించారు.