రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి

రవాణా రంగంలో  పెట్టుబడులు పెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి
  • రాష్ట్రాన్ని మోడల్ స్టేట్​గా మార్చేందుకు సహకరించండి
  • పారిశ్రామికవేత్తలను కోరిన రేవంత్
  • తక్కువ ఖర్చుతో.. వేగంగా ప్రయాణించాలన్నదే మా ఆకాంక్ష
  • పర్యావరణహితంగా నెట్ జీరో సిటీగా హైదరాబాద్
  • 100 కిలో మీటర్ల కొత్త మెట్రో లైన్లు నిర్మిస్తున్నాం
  • దావోస్​లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పర్యావరణ అనుకూలమైన సిటీగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలన్నారు. రవాణా రంగ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకారం అందించాలని కోరారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని, తెలంగాణను దేశానికి మోడల్ స్టేట్​గా మార్చేందుకు సహకరించాలన్నారు. దావోస్​లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు.

 ‘‘తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలన్నదే మా ప్రభుత్వం ఆకాంక్ష. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చుతున్నది. తెలంగాణ భవిష్యత్తు, అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్​లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నం. పర్యావరణహితంగా హైదరాబాద్ ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్​లోనే ఉండాలని కోరుకుంటున్నం. నగరాల అభివృద్ధి, వాటి భవిష్యత్తుకు అర్బన్ మొబిలిటీయే పునాది. తక్కువ ఖర్చుతో తక్కువ టైమ్​లో గమ్యాన్ని చేరుకునే ట్రాన్స్​పోర్టేషన్ ఉన్న నగరాలే వేగంగా డెవలప్ అవుతయ్’’అని సీఎం రేవంత్ తెలిపారు.

రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్ల నిర్మాణం

హైదరాబాద్ సిటీలో 1.2 కోట్లకు పైగా జనాభా ఉందని, దాదాపు 100 కిలో మీటర్లకుపైగా కొత్త మెట్రో లైన్లను నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఇప్పుడున్న దానికంటే ఇది రెండింతలు ఎక్కువ అని వివరించారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ 160 కిలో మీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నది. దీని బయట 360 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నం. ఆ రెండు రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు కూడా నిర్మిస్తాం. రింగ్ రోడ్లకు అనుబంధంగా రింగ్ రైల్వే లైను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం”సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ప్రత్యేక దృష్టి సారించి.. ఆ వాహనాలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు రద్దు చేసినట్లు తెలిపారు. ‘‘దేశంలో ఈవీ వెహికల్స్ ఎక్కువగా తెలంగాణలోనే అమ్ముడుపోతున్నాయి. 

మొబిలిటీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదు. ఇప్పుడున్న పరిస్థితులను పర్యావరణానికి అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థలో 3వేల ఎలక్ట్రిక్​ బస్సులు ప్రవేశపెడ్తున్నం. తెలంగాణ డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌజ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చేందుకు ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో లింక్ చేస్తాం. నేను, నా బృందంతో కలిసి జ్యూరిచ్ నుంచి దావోస్ కు రైల్లో ప్రయాణించాం. అదొక అందమైన అనుభూతిని కలిగించే ప్రయాణం’’అని రేవంత్ తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అర్బన్ మొబిలిటీపై తన అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ కు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.