తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2024 మే22 బుధవారం రోజున కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకునన్నారు. సీఎం హోదాలో తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు టీటీడీ అధికారులు, అర్చకులు.  రేవంత్‌ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.  

సీఎం రేవంత్ మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.  టీటీడీ  ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసి బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.  మరికాసేపట్లో ఆయన హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.  

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల వరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారు.  శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.  కాగా  నిన్న  తిరుమల శ్రీవారిని 80 వేల 744 మంది భక్తులు దర్శించుకున్నారు. 35 వేల 726 మంది భక్తులు  తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చినట్లుగా  టీటీడీ  అధికారులు వెల్లడించారు.