
- అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
- టన్నెల్ లోపలికెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం
ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పనుల్లో మిషిన్లతో పాటు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మంత్రులతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 11 ప్రభుత్వరంగ సంస్థల బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు వివరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలు చేయడం సరికాదంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. గల్లంతైన 8 మంది ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదన్నారు. ఆపరేషన్ కొలిక్కి రావడానికి మరో రెండు.. మూడ్రోజుల సమయం పడుతుందని వివరించారు.
కన్వేయర్ బెల్ట్ పాడవడంతో మట్టి తొలగించేందుకు ఇబ్బందులు ఎదువుతున్నాయన్నారు. వనపర్తిలో బహిరంగ సభ అనంతరం హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో టన్నెల్ వద్దకు వెళ్లారు. ఆఫీసర్లు, రెస్క్యూ టీమ్‌లతో కలిసి టన్నెల్లోకి కొంత దూరం వరకు వెళ్లారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
‘‘సహాయక చర్యల్లో మనుషులు, మిషన్లతో పాటు రోబోలను కూడా వాడాలని అధికారులను ఆదేశించాం. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. టన్నెల్ పనుల్లో ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో రోబోల హెల్ప్ తీసుకునేందుకు నిర్ణయించాం. సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్కుంటున్నం.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నరు. ఆయనకున్న అనుభవంతో రోబోలను కూడా తీసుకొచ్చి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నరు’’అని సీఎం రేవంత్ అన్నారు. మట్టి తీసిన తర్వాత మిషన్ తొలగించి, గల్లంతైన వారిని గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. టన్నెల్లో గల్లంతైన వారి కుటుంబాలకు అన్ని పార్టీలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంకా తాము మనో ధైర్యం కోల్పోలేదని, మరింత పట్టుదలతో ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
పదేండ్లు బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది
నల్లగొండ, పాలమూరుకు నీళ్లు అందించేందుకు 30 టీఎంసీలతో 2005లో ఎస్ఎల్బీసీని స్టార్ట్ చేశామని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘2014 వరకు దాదాపు 32 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేశాం. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక ఈ పనులు మరింత స్పీడ్‌గా పూర్తయి ఫ్లోరైడ్ బాధిత నల్లగొండకు శాశ్వత పరిష్కారం దొరుకుతదని భావించాం. కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదు. రెండు, మూడు కిలో మీటర్ల పని కూడా చేయలేదు. చేసిన పనులకుగాను కాంట్రాక్ట్ సంస్థకు బిల్లులు కూడా ఇవ్వలేదు. కరెంటు చార్జీలు కూడా కట్టకపోవడంతో మిషనరీకి విద్యుత్ శాఖ పవర్ కట్ చేసింది. దీంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. మేము అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించాం.
ఐటీ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చించాం. పనులు తిరిగి ప్రారంభించేందుకు టీబీఎంకు రిపేర్లు చేయించినం. పెండింగ్ బిల్లులు, సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ఉత్తమ్ సూచన మేరకు టీబీఎం కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అమెరికాకు పంపించాం’’అని సీఎం రేవంత్ అన్నారు. టీబీఎంకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి తెప్పించి పనులు ప్రారంభించామని తెలిపారు. అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందన్నారు.
కన్వేయర్ బెల్టు రిపేరు చేసి మట్టి బయటికి తీస్తం
రెస్క్యూ ఆపరేషన్‌పై నిపుణులతో సమీక్షించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 13.5 కిలో మీటర్ల నుంచి కన్వేయర్ బెల్ట్ పని చేయకపోవడంతో తీసిన మట్టిని బయటకు పంపించడంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సోమవారం వరకు కన్వేయర్ బెల్టును రిపేరు చేసి మట్టిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. లోపల మనుషులు ఎక్కడున్నారు? మిషిన్ ఎక్కడ ఉందనే దానిపై ప్రాథమిక అంచనాకు మాత్రమే వచ్చామన్నారు. ‘‘ప్రతిపక్షాలంతా తమ తమ బుర్రలో ఉన్న బురదను మాపై చల్లే ప్రయత్నం చేయొద్దు.
గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగింది. టీ పీపీసీ చీఫ్ హోదాలో నేను అక్కడికి వెళ్తుంటే అడ్డుకున్నరు. అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన్రు. దేవాదుల, కాళేశ్వరంలో ప్రమాదాలు జరిగి కొందరు చనిపోయినా.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతించ లేదు. ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగిందని తెలిసిన గంటలోనే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్, జూపల్లిని స్పాట్‌కు పంపించినం. ప్రధాని మోదీతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నం’’అని సీఎం రేవంత్ అన్నారు.
బీఆర్ఎస్ మాదిరి మేము ఎవర్నీ నిర్బంధించలేదు
ఎస్ఎల్బీసీ ప్రపంచంలోనే అదిపెద్ద టన్నెల్ అని.. మానవులు సృష్టించిన అద్భుతమని సీఎం రేవంత్ అన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. 8 మంది బాధిత కుటుంబ సభ్యులంతా ప్రాజెక్టును పరిశీలిస్తామంటే పంపించినం. బీఆర్ఎస్ మాదిరి ఎవర్నీ నిర్బంధించలేదు. ఇంత పారదర్శకంగా సమస్యను పరిష్కరిస్తుంటే.. మమ్మల్నే తప్పుబడ్తున్నరు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు’’అని రేవంత్ అన్నారు.
రెస్క్యూ సిబ్బంది ఎంతో కష్టపడ్తున్నరు
టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని సీఎం రేవంత్ తెలిపారు. వాళ్లు బతికున్నారా? చనిపోయారా? అనేది ఇంత వరకు నిపుణులు అంచనాకు రాలేదన్నారు. ‘‘అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై సమస్యను పరిష్కరించాలి. బాధిత కుటుంబాలను ఆదుకొని సానుభూతి చూయించాలి. అంతేగానీ రాజకీయాలు చేయొద్దు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లంతా మన ప్రాజెక్ట్‌లో పని చేసేందుకు కూలీలు, ఇంజినీర్లుగా వచ్చారు. వారికి సమస్య వచ్చినప్పుడు అందరూ అండగా నిలబడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 11 సంస్థలు బాధిత కుటుంబాలకు అండగా నిలబడ్డాయి. వాళ్లంతా ఎంతో కష్టపడ్తున్నరు’’అని రేవంత్ అన్నారు.