- ప్రపంచంలోనే హైదరాబాద్
- టాప్ 50లో ఉంటుంది: సత్య నాదెళ్ల
- అన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వ
- భాగస్వామిగా ఉంటామని వెల్లడి
- నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల్లో
- రేవంత్ విజన్ బాగుందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్లను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీతోపాటు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను డెవలప్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలువాలని అన్నారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన విస్తరణ చేపట్టాలని, డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని సత్య నాదెళ్లను సీఎం కోరారు. అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన సహకారం అందించనున్నట్టు రేవంత్ తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గురించి రేవంత్‌రెడ్డి వివరించారు. వీటితో పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు చేస్తున్న కృషిని సత్య నాదెళ్లకు తెలిపారు. హైదరాబాద్‌ను టెక్నాలజీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలపడంపై ప్రభుత్వం దృష్టిసారిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటాం: సత్య నాదెళ్ల
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటామని మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్టు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు. స్కిల్ డెవలప్మెంట్, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి.. హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో నిలుపుతాయని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
డేటా సెంటర్ల విస్తరణకు ప్రణాళికలు
డేటా సెంటర్ల విస్తరణకు మైక్రోసాఫ్ట్ భారీ ప్రణాళికలు పెట్టుకున్నది. అందులో భాగంగా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాల భూమితోపాటు మేకగూడ, షాద్‌నగర్, ఎలికట్ట, చందన్‌పల్లిలో భూములను కొనుగోలు చేసింది. ఇందులో కొన్ని చోట్ల ఇప్పటికే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. మరిన్ని పెట్టుబడులు, డేటా సెంటర్ల ఏర్పాటుపైనా సీఎంతో చర్చించారు. దావోస్ పర్యటనలో వీటికి సంబంధించిన ఒప్పందాలు ఉంటాయని తెలిసింది.