మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి

మన్మోహన్  సింగ్  భౌతికకాయానికి  సీఎం రేవంత్ నివాళి

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  నివాళి అర్పించారు. డిసెంబర్ 27న ఉదయం ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్.. మన్మోహన్ సింగ్ భార్య గురు శరణ్ కౌర్ ను ,కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతి తెలిపారు. రేవంత్ వెంట కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  మంత్రి దామోదర రాజనర్సింహా,  ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్ పలువురు ఉన్నారు.

మాజీ ప్రధాని, సీనియర్ కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ (92)కన్నుమూశారు. గురువారం(డిసెంబర్ 26) రాత్రి శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు నివాళి అర్పించారు.  డిసెంబర్ 28న మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. 

ALSO READ | సింప్లిసిటీ అంటే మన్మోహన్ దే.. ప్రధానిగా ఉన్నా మారుతీ 800 అంటేనే ఇష్టమంట

దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం  తిప్పిన మన్మోహన్ సింగ్.. రెండు సార్లు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయంలో 1991నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో  ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను తన వ్యూహచతురతో గాడిన పెట్టారు. ఐదుసార్లు రాజ్య సభ్యుడిగా పనిచేసిన మన్మోహన్ సింగ్.. 1987లో భారత ప్రతిష్టాత్మక అవార్డు పద్మ విభూషన్ అందుకున్నారు.