ఏప్రిల్ 14 నుంచి తెలంగాణ భూ భారతి

ఏప్రిల్ 14 నుంచి తెలంగాణ భూ భారతి
  • దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం 
  • ఆరు మాడ్యుల్స్​తో సులభంగా ఉండేలా కొత్త వెబ్​సైట్ 
  • చాట్​బాట్​తో పాటు ప్రత్యేక యాప్ ఏర్పాటుకు కసరత్తు 

హైదరాబాద్, వెలుగు:కొత్త భూ భారతి చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి అమల్లోకి రానున్నది. ఈమేరకు తెలంగాణ భూ భారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్) యాక్ట్, 2025 ఆవిష్కరణకు డేట్ ఫిక్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భూ భారతి చట్టం ప్రొవిజన్స్‌‌తో కొత్త పోర్టల్‌‌ను ప్రారంభించనున్నారు. శిల్ప కళావేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్లను సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆదేశించారు.


కొత్త భూ భారతి చట్టం ఒకేసారి అమల్లోకి రావడం లేదు. ఫేజ్​ల వారీగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. మొదటి ఫేజ్ ను ప్రారంభించేందుకు అటు రెవెన్యూ, ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ధరణిలో 33కు పైగా మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌ ఉండగా, భూ భారతిలో కేవలం 6 మాడ్యూల్స్‌‌‌‌‌‌‌‌తో సమస్యలను సులభంగా పరిష్కరించేలా కొత్త వెబ్​సైట్ రూపొందించింది. దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్​ లేకుండానే అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం లభించనున్నది. ధరణి పోర్టల్ స్లోగా ఉండటంతో పాటు యూజర్ ఫ్రెండ్లీగా లేదు. దీంతో యూజర్​ ఫ్రెండ్లీ భూ భారతిని తీసుకురావడమే కాకుండా.. వెబ్ పోర్టల్ స్పీడ్​ను పెంచారు. ఇక అప్పీళ్ల వ్యవస్థ కూడా అందుబాటులోకి రానున్నది. భూ భారతి చట్టంలో తహసీల్దార్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌డీఓ, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ స్థాయిలో అప్పీల్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ ఉంది. ధరణిలో ఏం రిజెక్ట్ చేసినా కోర్టులపై ఆధారపడాల్సి వచ్చేది. భూ భారతిలో జిల్లా స్థాయిలోనే అప్పీల్ వ్యవస్థ పెట్టారు. దీంతో రైతులకు సమయం, ఖర్చు ఆదా కానున్నది. గతేడాది డిసెంబర్​లో అసెంబ్లీ, కౌన్సిల్​లో భూ భారతి బిల్లుకు ఆమోదం లభించింది. గవర్నర్ జనవరి 3వ తేదీన ఆమోదించగా.. జనవరి 20వ తేదీన ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భూ భారతి పోర్టల్‌‌‌‌‌‌‌‌, భూధార్‌‌‌‌‌‌‌‌ విధానం, కొత్త పహాణీ వ్యవస్థతో రైతుల సమస్యలు పరిష్కారమై, పారదర్శక భూ రికార్డులు అందుబాటులోకి రానున్నాయి.

డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు చాట్​బాట్

భూ భారతి పోర్టల్​లో ఒక చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో పాటు ఒక ప్రత్యేక యాప్​ను కూడా తీసుకురావాలని.. ఇందులో ఎం వ్యాలెట్ మాదిరి ప్రతి రైతు వారికి సంబంధించిన వివరాలను టెంపరరీ భూధార్ నంబర్​తో కలిగి ఉండేలా తీసుకువస్తున్నారు. ఇక చాట్​బాట్​లో భూ భారతి పోర్టల్​లో ఏదైనా డౌట్ క్లియర్ చేసుకోవాలన్నా చాట్ బాట్ ఉపయోగపడనుంది. ఏ సమస్యకు ఏ అప్లికేషన్​ పెట్టుకోవాలి? ఎలాంటి డాక్యుమెంట్లు అవసరమో కూడా చెప్పనున్నది. చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ భూ భారతి చట్టం ప్రయోజనాలను, హక్కులను సరళంగా వివరిస్తూ, రైతులను చైతన్యం చేయనున్నది. చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ తో రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందనున్నాయి. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌డీవో కార్యాలయాల్లో సమాచారం కోసం వచ్చే రైతుల రద్దీ తగ్గుతుంది. అధికారుల వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ తగ్గి, వేగంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. పైగా, పోర్టల్‌‌‌‌‌‌‌‌ సాంకేతిక సమస్యలను చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ గుర్తించి, అధికారులకు నివేదిస్తూ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.