16న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్

 16న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్
  • హాజరుకానున్న ఎస్పీలు, పోలీస్​ కమిషనర్లు

క్షేత్రస్థాయి పాలనపై సీఎం రేవంత్​ రెడ్డి ఫోకస్​ పెంచారు. ఈ నెల 16న కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ సెక్రటేరియెట్​లో మొదటిసారి ఏడో ఫ్లోర్​లోని వెస్ట్​ కాన్ఫరెన్స్​ హాల్​లో భేటీ అవుతున్నారు. ఉదయం 9.30 గంటలకు సీఎం సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు సీఎస్​ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్​ సాగు, సీజనల్​ వ్యాధులు, వనమహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్​ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ తదితర అంశాలపై సీఎం రేవంత్​చర్చించనున్నారు. ఇప్పటికే ధరణిపై  సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్​సెక్రటరీ నవీన్​ మిట్టల్​ జిల్లా కలెక్టర్లతో రెండుసార్లు సమావేశమై, పెండింగ్​ అప్లికేషన్లపై సమీక్షించారు. విద్య, మహిళా శక్తి, డ్రగ్స్​ నియంత్రణపై సీఎస్​ వరుస రివ్యూలు చేస్తున్నారు. జిల్లాల్లో శాంతి భద్రతల విషయంలోనూ పోలీసులకు సీఎం  దిశానిర్దేశం చేశారు. ఇటీవలే అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం సమావేశం నిర్వహించారు.

కొందరు కలెక్టర్లు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పాలనా వ్యవస్థ మరింత పటిష్టం కావాలని చెప్పారు. తాను వారానికో జిల్లా పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నట్టు తెలిపారు. ఇటీవల మహబూబ్​నగర్​ జిల్లాలో పర్యటించిన రేవంత్..​ త్వరలో కరీంనగర్​ జిల్లాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.