
SLBC టన్నెల్ ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు..ఈ ఘటన అనుకోకుండా జరిగిందని, ఇది ఒక విపత్తు అని.. దీనిపై రాజకీయం చేయొద్దని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని.. సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు సలహాలు ఇవ్వొచ్చని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెస్క్యూ టీములు ఆనవాళ్లే గుర్తించాయని.. ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని అన్నారు. ఈ ప్రమాదం జరగగానే సంబంధిత మంత్రి, లోకల్ మంత్రి ఘటనాస్థలికి వచ్చారని అన్నారు. విపక్షాలు వాళ్ళ మెదడులో ఉన్న బురదను మాపై చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్.
ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు నీళ్లివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 2014 నాటికి 32 కిలోమీటర్ల మేర టన్నెల్ పూర్తయ్యిందని.. పదేళ్ల పాలనలో కేసీఆర్ టన్నెల్ ను పక్కన పెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే టన్నెల్ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టామని అన్నారు. అనుకోని విధంగా టన్నెల్ లో విషాదం జరిగిందని అన్నారు. ఈ ప్రమాదంలో 8మంది గల్లంతు కావటం బాధాకరమని అన్నారు సీఎం రేవంత్.
ఘటన జరిగిన మరుక్షణం నుండి రెస్క్యూ చేస్తున్నామని.. జాతీయ, అంతర్జాతీయ టెక్నీషియన్లను పిలిపించి రెస్క్యూ చేపట్టామని అన్నారు. గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ జనరేషన్ లో ప్రమాదం జరిగితే ఎవ్వరినీ అక్కడికి వెళ్లనివ్వలేదని.. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా తాను వస్తే జైల్లో పెట్టారని అన్నారు సీఎం రేవంత్. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఎక్కడ మరణించినా ఆనాడు ప్రభుత్వం విపక్షాలను అనుమతివ్వలేదని.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడకు వెళ్ళలేదని అన్నారు సీఎం రేవంత్.
కానీ ఈ ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ ను పంపి, కేంద్రంతో సమన్వయం చేసుకుని అన్ని సంస్థలను ఇక్కడికి రప్పించామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ఇది… మేం మనోధైర్యం కోల్పోలేదని అన్నారు సీఎం రేవంత్. ఈ సమస్య పరిష్కరించేందుకు అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉందని..ఇందుకు అందరూ సహకరించాలని కోరుతున్నానని అన్నారు సీఎం రేవంత్.