రోహిత్ వేముల చట్టం తెస్తంరాహుల్ గాంధీ లేఖపై సీఎం రేవంత్

రోహిత్ వేముల చట్టం తెస్తంరాహుల్ గాంధీ లేఖపై సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: విద్యా సంస్థల్లో కులవివక్షను అరికట్టేందుకు ‘రోహిత్ వేముల చట్టం’ తేవాలని కాంగ్రెస్  ఎంపీ రాహుల్  గాంధీ రాసిన లేఖకు  సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జపాన్‌లోని హిరోషిమాలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ లేఖను చదివానని ‘ఎక్స్’ లో రేవంత్  తెలిపారు. ఈ లేఖ తనను లోతుగా కదిలించిందని, కులవివక్షను నిర్మూలించేందుకు ఈ పిలుపు చర్యకు ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. రోహిత్  వేముల చట్టాన్ని తెస్తామని తెలిపారు. “మీ (రాహుల్) ఆలోచనలు, భావనల స్ఫూర్తితో మనం గర్వించదగిన భవిష్యత్తును నిర్మించే దిశగా ముందుకు సాగుతాం” అని సీఎం పేర్కొన్నారు. 

ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి

జమ్మూ కాశ్మీర్‌‌లోని పహల్గామ్‌‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్య భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ‘ఎక్స్’​లో ఆయన ట్వీట్ చేశారు. పహల్గామ్‌‌లో పర్యాటకులపై  ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో పలువురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.