తెలంగాణలో మరోసారి పెరిగిన చలి .. చలిమంటలతో ఉపశమనం పొందుతున్న జనాలు

తెలంగాణలో మరోసారి పెరిగిన చలి .. చలిమంటలతో ఉపశమనం పొందుతున్న జనాలు

తెలంగాణలో మరోసారి చలి పెరిగింది. హైదరాబాద్ శివారులో భారీగా పొగమంచు కురుస్తుంది.  ఉదయం 8 దాటిన తరువాత కూడా  రోడ్లను పొగమంచు కప్పేసింది. చలి తీవ్రతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మంచుతో రోడ్లు కనపడక చాలా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై జనాలు చలి మంటలు వేసుకుంటున్నారు.చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.

చలి తీవ్రతతో పాటు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా... ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్ఫ్లూయెంజా లక్షణాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. జాగ్రత్తలను సూచించింది. తీవ్రమైన చలికి గురికావడం వల్ల హైపోథెర్మియాతో పాటు ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్ లో అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ  పేర్కొంది. చలి గాలిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలని వివరించింది. జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి నీళ్లు కారటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. విటమిన్ సీ ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది