- గ్రీవెన్స్‌కు 298 దరఖాస్తులు: కలెక్టర్
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ హాస్పిటల్‌లోని ఐసీటీసీ సెంటర్‌కు స్టేట్ లెవల్ పురస్కారం రావడం సంతోషకరమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డితో ఐసీటీసీ సెంటర్ ఉద్యోగులను కలెక్టర్ ప్రశంసించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 298 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఇన్‌చార్జి డీఆర్‌వో పవన్ కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ బాబు, ఐసీటీటీ కౌన్సిలర్ డా.ఎం.సదానందచారి పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్/మెట్‌పల్లి, వెలుగు: ప్రజావాణిలో వచ్చే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అడిషనల్ కలెక్టర్లు లత, గౌతమ్‌రెడ్డిలతో కలిసి 43 ఫిర్యాదులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. నర్సింగాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 437, 251 లో గల ప్రభుత్వ భూములు అక్రమంగా ధరణిలో పట్టాలు చేయించుకున్నారని, వాటిని రద్దుచేసి దళితులకు పంపిణీ చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన దళితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మెట్‌పల్లి పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రైమరీ, హైస్కూల్‌లో టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలని ముస్లిం సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ అఖ్తర్ జాని డిమాండ్ చేశారు. సోమవారం మెట్‌పల్లి తహసీల్ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో కమిటీ సభ్యులతో కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
అగ్రిమెంట్ రాయించుకొని భూమిని కాజేశారు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: భూమి కొంటానని అగ్రిమెంట్ పేపర్ రాయించుకొని, దానితో సాదాబైనామా కింద ఐదెకరాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు సిరిసిల్ల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి వెంకట్రాములు, శంకరయ్యలు అన్నదమ్ములు. ఇదే గ్రామానికి చెందిన ఈర్లపల్లి చిన్నరాములు 2017లో సర్వే నంబర్ 73/ఏ లోని 4.15ఎకరాలు కొనుగోలు చేసి, మూడు కిస్తీల్లో డబ్బులు చెల్లించేలా అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఒకే కిస్తీ డబ్బు చెల్లించుకొని ఒప్పంద పత్రాన్ని సాదాబైనామా కింద తన పేరుమీదకు మార్చుకున్నాడని వెంకట్రాములు,శంకరయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో అప్పటి చందుర్తి తహసీల్దార్, మల్యాల వీఆర్వో సహకరించారని ఆరోపించారు. కాగా ప్రజావాణికి 152 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు.