
టోక్యో: అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. శనివారం (ఏప్రిల్ 19) జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో జపాన్‌లోని తెలుగు వారు భాగం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని.. రాష్ట్రంలో త్వరలోనే డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
టోక్యోలో రివర్ ఫ్రంట్‌ను పరిశీలించామన్నారు. మూసీనది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని.. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.