సైంటిఫిక్​గా చేసిన సర్వేలో 56.33 శాతం బీసీలు

సైంటిఫిక్​గా చేసిన సర్వేలో 56.33 శాతం బీసీలు
  • దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన
  • ఢిల్లీలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టిందని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. సైంటిఫిక్ బేసిస్ లో చేసిన ఈ సర్వేలో బీసీలు 56.33 శాతంగా ఉన్నారని తెలిపారు. ఈ సర్వేలో హిందువుల్లో బీసీలు 46.25 శాతం, ముస్లింలలోని బీసీలు 10.08 శాతం ఉన్నారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్ లోని గురజాడ హాల్ లో తెలంగాణ ఎంపీల కన్వీనర్ మల్లు రవి నేతృత్వంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కులగణన ఎంతో శాస్త్రీయంగా జరిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కరోజులో మొక్కుబడిగా సర్వే ముగించారని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజులపాటు సమగ్రంగా సర్వే చేసిందని వివరించారు. 

కులగణన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బీసీ సంఘాలన్నింటికి కూడా కులగణనపై వివరణ ఇచ్చామన్నారు. బీసీ ఉప ముఖ్యమంత్రి విషయంపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారమే బీసీ ముస్లింలు ఉన్నారన్నారు. మంచి పనిచేస్తున్నప్పుడు బాధ్యతాయుత ప్రతిపక్షంగా బీఆర్‌‌ఎస్‌‌ వ్యవహరించాలని సూచించారు. బీసీలకు న్యాయం జరగాలనే చిత్తశుద్ధితో కులగణన చేశామని చెప్పారు. మూడో సారి ప్రధాని అయినా మోదీ కులగణన చేయలేదని మండిపడ్డారు. ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఒక్కరోజు కూడా రేవంత్‌‌ రెడ్డి సెలవు తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ ఎంపీలంతా మోదీని కలిసి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కులగణన పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రానికి చెందిన 17 మంది ఎంపీలం ప్రధాని మోదీని కలుస్తామని తెలిపారు. ఆ తర్వాత మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మల్లు రవి సమాధానమిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమయం ఇవ్వడంలేదనడంలో వాస్తవం లేదన్నారు. ఆ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కావాలనే.. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.