
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామనడం తెలంగాణ ప్రభుత్వ విజయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక అసమానతలు తొలగించడానికి దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఇందుకోసం ముందుగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసి దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. కులగణన ఆధారంగా బీసీ లకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని తెలిపారు. ఇది ఒక్క గొప్ప మార్పుగా భావిస్తున్నాం. దీని ద్వారా సామాజిక రుగ్మతలు తొలగి అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పొన్నం తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ . కులగణనతో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగింది. దేశ చరిత్రలో మొదటిసారిగా కుల గణన నిర్వహించాం. కులగణన చేపట్టాలనే రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడి మేరకు కులగణనకు ఒప్పుకుంది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాస్త్రీయంగా కులగణనను విజయవంతంగా పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. కులగణన లెక్కల ఆధారంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. తెలంగాణలో కాంగ్రెస్ నిర్వహించిన కులగణనను ఇంతకాలం అపహాస్యం చేసిన బీజేపీ ఇప్పుడు మా దారిలోకి రావడం సంతోషకరం. కేంద్ర ప్రభుత్వం అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు మహేశ్ కుమార్ గౌడ్.
►ALSO READ | 94 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన : కేంద్రం సంచలన నిర్ణయం
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం శుభ పరిణామం అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.జనగణనలో కులగణన అన్ని వర్గాలకు మేలు చేస్తుందనేది రాహుల్ గాంధీ డిమాండ్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి BC బిల్లుపై ఒత్తిడే కేంద్ర నిర్ణయానికి కారణం అని అన్నారు. రాజకీయాల కోసం, ఎన్నికల కోసం కాకుండా చిత్తశుద్ధిగా అమలు చెయ్యాలని చెప్పారు.