- సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం
- రెండున్నర గంటల పాటు స్టాటజీ మీటింగ్
- తెలంగాణలోనూ కర్నాటక వ్యూహమే అమలు
- రాష్ట్ర నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారు
- బీజేపీకి బీ టీమ్ గా బీఆర్ఎస్ పనిచేస్తోంది .. ఇది ప్రజలందరికీ తెలుసు : ఠాక్రే
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో జరిగిన మీటింగ్ ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు నేతలు భవిష్యత్ కార్యాచారణపై చర్చించారు. 120 రోజుల పాటు కష్టపడి పనిచేయాలని, కర్నాటక స్టాటజీని ఇక్కడ కూడా అవలంబించాలని పార్టీ అధినాయకత్వం సూచించినట్టు సమాచారం. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యనేతలు సూచించినట్టు తెలిసింది.
దీంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిని, ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో జరిగిన భూ దందాలను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కి బీటీమ్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకు సాక్ష్యంగా గతంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే నిర్వహించిన మీటింగ్ లకు బీఆర్ఎస్ గైర్హారైన విషయాలను ప్రస్తావించాలని సూచించారు. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికీ బీఆర్ఎస్ హాజరు కాలేదనే విషయాన్న నొక్కి చెప్పాలని సూచించినట్టు సమాచారం.
అందరూ ఒక్కతాటిపైకి: ఠాక్రే
రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న విభేదాలపై మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. రెండున్నర గంటల సమావేశంలో అన్ని విషయాలను చర్చించామని, అందరి అభ్యర్థలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ ఓపికగా విన్నారని, పరిష్కారమార్గాలను సూచించారని ఠాక్రే చెప్పారు. బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు అందరూ కలిసి పనిచేస్తారని, ఐదారు నెలల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. వంద శాతం నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు.
ఎవరేం చేస్తున్నారో అన్నీ తెలుసు: రాహుల్
తెలంగాణలో పార్టీ కోసం ఎవరేం చేశారో..? ఏం చేస్తున్నారో..? తనకు అన్నీ తెలుసునని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. విభేదాలు ఉంటే రాష్ట్ర ఇన్ చార్జితో మాట్లాడాలని, ఎట్టి పరిస్థితిలోనూ బయట మాట్లాడవద్దని సూచించారు. క్రమ శిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించబోమన్నారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుందని చెప్పారు.
కార్యాచరణ మొదలైంది: రేవంత్
తెలంగాణలో ఎన్నికల కార్యాచరణ మొదలైందని, కర్నాటకలో పాటించిన సూత్రాలనే తెలంగాణలోనూ అనుసరిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నపార్టీ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. ముఖ్యనేతలంతా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు.
ALSO READ: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్
అందరి అభిప్రాయాలు చెప్పాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సంస్థాగత అంశాలకు సంబంధించిన అభిప్రాయాలను తామంతా అధిష్టానానికి వివరించామని, ఇందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశాలనూ తమతో చర్చించారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టికెట్ల ప్రక్రియ ఎలా ఉండాలనే విషయాలనూ చర్చించినట్లు వివరించారు.