- మూసీ, హైడ్రాపై గులాబీ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం
- ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల కౌంటర్ ఎటాక్
- జనానికి వాస్తవాలు చెప్పాలని పార్టీ కేడర్‌కు పీసీసీ చీఫ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్‌పై బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గులాబీ పార్టీ సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి దిగుతున్నదని.. దీనిపై జనంలోకి వెళ్లి, వాస్తవాలను వివరించాలని కాంగ్రెస్ శ్రేణులను అధికార పార్టీ ఆదేశించింది. ముఖ్యంగా హైడ్రా, మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ అబద్ధాలను చెప్తున్నదని, ఎక్కడిక్కడ ఎండగట్టాలని దిశానిర్దేశం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు నాలాలు, చెరువులపై అక్రమ నిర్మాణాలు కూల్చితీరుతామన్నవాళ్లే ఇప్పుడు నిర్వాసితులను రెచ్చగొడ్తున్నారని.. ఇందుకు కౌంటర్ అటాక్ ఇవ్వాలని కేడర్‌కు సూచించింది.
కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో మంగళవారమే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి.. బీఆర్ఎస్ నేతల తీరును ఎండగడ్తున్నారు. అసలు 2017 లో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమని, 2022 లో నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలన్న నిర్ణయం కూడా వాళ్లదేనని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈమేరకు ఆధారాలను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. హైడ్రా, మూసీ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న దుష్ర్పచారాన్ని దీటుగా ఎదుర్కోవాలని, అదే సమయంలో మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామనే భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ దిశానిర్దేశం చేశారు.
అబద్ధాలను నిజాలుగా..!
ముందుగా మూసీ వెంట ఉన్న వారి వివరాలు సేకరించాలని, వారితో మాట్లాడి, ఒప్పించి, డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలించాలని.. ఆ తర్వాతే కూల్చివేతలు చేపట్టాలనిసెప్టెంబర్ 24న సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగడానికి వీల్లేదన్నారు. మూసీకి ఇరువైపులా 13 వేల నిర్మాణాలు ఉన్నాయని అప్పటికే ఆఫీసర్లు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా అదే రోజు ఏకంగా16 వేల డబుల్బెడ్రూం ఇండ్లను మూసీ నిర్వాసితులకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతానికి మూసీ రివర్బెడ్(నదీగర్భం)లోని నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని.. బఫర్ జోన్ పరిధిలోకి వెళ్లబోమని సెప్టెంబర్ 28న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ఎండీ దాన కిశోర్ప్రకటించారు.
మూడు జిల్లాల పరిధిలోని రివర్‌బెడ్‌లో ఉన్న 2,166 ఇండ్లను మాత్రమే ఖాళీ చేయిస్తామని.. వాళ్లను కూడా డబుల్బెడ్రూం ఇండ్లలోకి పంపిన తర్వాతే కూల్చివేతల ప్రక్రియ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కానీ.. సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమైన సర్వేలో భాగంగా కొందరు అధికారులు అత్యుత్సాహంతో రివర్‌బెడ్‌లోని ఇండ్లకు రెడ్మార్క్వేయడంతో జనాల్లో టెన్షన్ మొదలైంది. ఇదే అదనుగా రంగంలోకి దిగిన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఇష్యూకు రాజకీయ రంగు పులిమారని, స్థానికులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో ముందు డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్లాలనుకున్న కొందరు మనసు మార్చుకున్నారని వారు చెప్తున్నారు. ఇక పలు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్ల పరిధిలో హైడ్రా కేవలం కమర్షియల్ నిర్మాణాలు తప్ప ఎలాంటి నివాసాలను కూల్చనప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు వాటిని నివాసాలుగా చూపుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాయని, తద్వారా ప్రభుత్వంపై ఒక పథకం ప్రకారం దుష్ర్పచారం జరిగిందని అంటున్నారు. అందుకే వాస్తవాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
జనాలకు నిజాలు చెప్పండి: పీసీసీ చీఫ్
మూసీ ప్రక్షాళన, హైడ్రా పనితీరుపై బీఆర్ఎస్, బీజేపీ దుర్మార్గపు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని ఒకవైపు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్మీడియా ద్వారా సమర్థవంతంగా తిప్పికొడుతూనే, మరోవైపు జనాల్లోకి వాస్తవాలను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కేడర్ తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి’’ అని ఆయన దిశానిర్దేశం చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో సుమారు 40 మంది వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లతో పీసీసీ చీఫ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రోజుకు 18 గంటల పాటు విరామం లేకుండా పనిచేస్తూ, ఆరు గ్యారంటీల అమలు ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు కృషి చేస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారంతో గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నాయన్నారు. వివిధ చైర్మన్లుగా కీలకమైన బాధ్యతల్లో ఉన్న మీరంతా ఆ విష ప్రచారాన్ని తిప్పికొడ్తూ జనాలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని వారికి సూచించారు. ఇందుకోసం మరింత దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సాధించలేని అభివృద్ధిని కాంగ్రెస్ సర్కారు కేవలం పది నెలల పాలనలో సాధించిందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, కొత్త డీఎస్సీతో 11 వేల ఉద్యోగాలు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు లాంటి అంశాలను జనంలోకి బాగా తీసుకెళ్లాలని కార్పొరేషన్చైర్మన్లకు సూచించారు.
ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 2 లక్షల రైతు రుణమాఫీ వంటి చారిత్రాత్మక పథకాన్ని అమలుచేయలేదని, ఏకకాలంలో రైతుల అకౌంట్లలో రూ.18వేల కోట్లను జమచేసినా ప్రతిపక్షాలు మాత్రం అసలు రుణమాఫే చేయలేదన్నట్లు మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. ‘‘ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు మనం గట్టిగా బదులివ్వకపోతే అబద్ధాలే నిజాలని అనుకునే ప్రమాదముంది. అందుకే వాళ్లకు కౌంటర్ ఇస్తూనే వాస్తవాలను బయటపెట్టాలి’’ అని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులు రాగానే కొందరు ఇక తమకు పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇకపై ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదని, పార్టీ నిర్మాణంపై ఫోకస్పెడ్తూనే కేడర్‌తో టచ్ లో ఉండాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ హితబోధ చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విషప్రచారాన్ని ఒకవైపు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్మీడియా ద్వారా సమర్థవంతంగా తిప్పికొడుతూనే, మరోవైపు జనాల్లోకి వాస్తవాలను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కేడర్ తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి.
ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు మనం గట్టిగా బదులివ్వకపోతే అబద్ధాలే నిజాలని అనుకునే ప్రమాదముంది. అందుకే కౌంటర్ ఇస్తూనే వాస్తవాలను బయటపెట్టాలి. - పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్