కుల గణన, ఎస్సీ వర్గీకరణ తీర్మానాలపై.. గాంధీ భవన్​లో సంబురాలు

కుల గణన, ఎస్సీ వర్గీకరణ తీర్మానాలపై.. గాంధీ భవన్​లో సంబురాలు
  • పటాకులు కాల్చి స్వీట్లు పంచిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • కాంగ్రెస్ మార్క్ విజయమని ప్రకటన

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, కుల గణన నివేదికలు ప్రవేశపెట్టి తీర్మానం చేయడంపై మంగళవారం గాంధీ భవన్ లో పీసీసీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, సతీష్ మాదిగ, పుష్పలీల, పలువురు నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. పటాకులు కాల్చి.. స్వీట్లు పంచి.. డ్యాన్సులు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడారు. 

కుల గణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేయడం కాంగ్రెస్ మార్క్ విజయమన్నారు. దీనికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కుల గణన, ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైందని అభివర్ణించారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల గణనపై సర్వే చేసి పూర్తి చేశామన్నారు.