హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమకు చెందిన కొందరిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నందున ఈ అంశానికి ఇక్కడితో ముగింపు పలకాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సినీ పరిశ్రమ పెద్దలకు గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలో ఇరు వైపులా మహిళలే ఉన్నందున ఈ విషయాన్ని ఇక వదిలేయాలని ఆయన కోరారు. మహిళల మనోభావాలను కించపరచాలనేది మంత్రి ఉద్దేశం కాదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.
కొండా సురేఖ చేసిన ట్వీట్ లో కూడా సమంత హీరోయిన్ గా ఎదిగిన తీరు తనకు అభిమానమే కాదు ఆదర్శం అని కూడా పేర్కొన్న విషయాన్ని మహేశ్ గౌడ్ గుర్తు చేశారు. ఒక సోదరుడు.. సోదరికి నూలుపోగు దండ వేస్తే కొండా సురేఖపై సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేశారో చూశామని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఇక నుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పీసీసీ చీఫ్ సూచించారు.