
- 30 శాతం కమీషన్‌పై రూ.5,200 కోట్లకు ఒప్పందం చేసుకున్నరు
- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణ
- కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే ఆ డబ్బు కేటీఆర్‌కు చేరేది
- కమీషన్ మిస్సయిందనే ఆయనకు కడుపు మంట అని ఫైర్
- ఐసీఐసీఐలో 10 వేల కోట్ల లోన్ తీసుకొని రుణమాఫీ చేసినం
- ఆ డబ్బులతో సన్న వడ్లకు బోనస్ ఇచ్చినం
- లోన్ కోసం కన్సల్టెన్సీని ఆశ్రయిస్తే తప్పేంటి?
- రూ. 175 కోట్లు వైట్ ను ఆ సంస్థకు బదిలీ చేసినం
- ఇందులో కుంభకోణం ఏముంది? అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ఐఎంజీ భారత్ అనే సంస్థకు, దానితో సంబంధం ఉన్న బిల్లిరావు అనే వ్యక్తికి కట్టబెట్టేందుకు కేటీఆర్ కమీషన్ మాట్లాడుకున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. 30 శాతం కమీషన్ కింద అంటే రూ. 5,200 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు. అయితే, కేటీఆర్ దురదృష్టంకొద్దీ తాము అధికారంలోకి వచ్చామని, లేదంటే ఆ భూముల కింద మొత్తం డబ్బు కమీషన్ల రూపంలో కేటీఆర్ ఖాతాలో చేరేదని అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మహేశ్‌గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ భూములను ఐంఎంజీ భారత్ సంస్థకు, బిల్లి రావుకు కట్టబెట్టారని వివరించారు. ఆ తర్వాత సీఎంగా వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాటిని వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత సదరు సంస్థ కోర్టును ఆశ్రయించిందని, పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల విషయాన్ని అసలు పట్టించుకోలేదని అన్నారు. మరి అప్పుడు హెచ్‌సీయూ భూమి బీఆర్ఎస్ కు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కేటీఆర్ గుంటూరులో ఏం చదివిండో ఏమోనని, సగం తెలిసి, సగం తెలవక మాట్లాడుతుండని మండిపడ్డారు.
పబ్లిక్ డొమైన్లో వివరాలు
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతనే కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వానికి దక్కేలా చొరవచూపారని మహేశ్ కుమార్ గౌడ్చెప్పారు. అందులో భాగంగానే టీజీఐఐసీకి రూ. 75 కోట్లకు ఎకరం చొప్పున సర్కారు ఇచ్చిందని, వాటిని ష్యురిటీగా చూపి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 10 వేల కోట్ల రుణం బాండ్ల రూపంలో తీసుకుందని వివరించారు. ఆ డబ్బును రైతు రుణమాఫీకి, సన్న వడ్ల కింద బోనస్ కు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోలేదని, అది పబ్లిక్ డొమైన్ లో కూడా ఉందన్నారు.
రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే కేటీఆర్ కు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. ఇందులో రూ.175 కోట్ల అంశం లేవనెత్తి, అదో కుంభకోణం అని కేటీఆర్ ఆరోపిస్తున్నారని, లోన్లు కావాలంటే ప్రభుత్వం ఏదో ఒక ఏజెన్సీని ఆశ్రయించాల్సిందేనని చెప్పారు. ఇది అన్ని ప్రభుత్వాలు చేసే పనే అని, లోన్ కోసం ట్రస్ట్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. రూ. 175 కోట్ల వైట్ మనీని ప్రభుత్వం ఆ ట్రస్ట్ ఖాతాలోకి బదిలీ చేసిందని, ఈ డబ్బు కాంగ్రెస్ నేతలకు చేరలేదని చెప్పారు. దీనికి ఇంకేదో కుంభకోణం జరిగిందని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరం రూ. 100 కోట్లకు అమ్ముకున్నారని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీల కన్నా ఎక్కువగా అడ్వర్టైజ్ చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ సర్కారుదని ధ్వజమెత్తారు. కోకాపేటలో వంద కోట్లకు ఎకరం పలికినప్పుడు.. ఇక్కడ వంద కోట్లకు ఎందుకు పలుకదని ప్రశ్నించారు. ఏఐ టెక్నాలజీతో జింకలు దుంకుతున్నట్లు, నెమళ్లు పరిగెత్తుతున్నట్టుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
దేశ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్నది కేసీఆర్ ఫ్యామిలీ అని, అలాంటి వాళ్లు కరప్షన్ మీద మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని మహేశ్‌గౌడ్ అన్నారు. ‘‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని లక్షల ఎకరాల భూములు అమ్మారు? ఎన్ని కొండలు కరిగినయ్?” అనేదానిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న సుమారు 10 వేల ఎకరాల భూములను తన చుట్టూ ఉన్నవారికి అప్పనంగా అమ్ముకున్నారని ఆరోపించారు. అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ మీటింగ్ తర్వాత బీజేపీకి వణుకు పుట్టిందని, ఈ రెండు పార్టీలు కలిసి హెచ్ సీయూ భూమి వివాదాన్ని తెరపైకి తెచ్చాయని ఆరోపించారు. ఫార్ములా ఈ- రేస్ కేసులో కేటీఆర్ ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. రేపో మాపో తన అరెస్టు తప్పదనే.. ఆ కేసుకు కంచ గచ్చిబౌలి ఇష్యూకు కేటీఆర్ ముడిపెడుతున్నాడని, ఆ కేసుకు, ఈ కేసుకు అసలు సంబంధం లేదని చెప్పారు. శ్రీధర్ బాబు సీఎం కావాలని బీజేపీ ఎంపీ అర్వింద్ కోరుకుంటే తప్పేంటని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కసుతో మూసీని అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. గుజరాత్ లో సబర్మతి ప్రక్షాళనను సమర్థించే ఆయన.. ఇక్కడ మాత్రం మూసీని ఎలా వ్యతిరేకిస్తాడని ప్రశ్నించారు. హైదరాబాద్ లో అభివృద్ధి జరిగితే తమకు పుట్టగతులు ఉండవని బీజేపీ, బీఆర్ఎస్ లు భావిస్తున్నాయని, అందుకే అభివృద్ధికి ఆ పార్టీలు అడ్డుతగులుతున్నాయని మండిపడ్డారు.