దేశంలో కార్పొరేట్ రాజ్యం నడుస్తోంది: మీనాక్షి నటరాజన్

దేశంలో  కార్పొరేట్ రాజ్యం నడుస్తోంది: మీనాక్షి నటరాజన్

ప్రస్తుతం దేశంలో కార్పొరేట్ రాజ్యం నడుస్తోందన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్.   హైదరాబాద్  లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక  30 వ వార్షికోత్సవ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మీనాక్షి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె...  చిన్న, మధ్య తరగతి ప్రజలపై భారీగా పన్నుల భారం పడుతోందన్నారు. పేద , మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదన్నారు.  అన్ని వర్గాల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలన్నారు. 


మీనాక్షి  నటరాజన్  ఇవాళ్టి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు  ఆయా  నియోజకవర్గాల ఎంపీలు,ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

సింప్లిసిటీకి కేరాఫ్ మీనాక్షి


పార్టీ పరంగా ఎంతో కీలకమైన స్థానంలో ఉన్నప్పటికీ.. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉన్న  మీనాక్షి నటరాజన్  సింప్లిసిటీని చూసి అందరూ ముగ్ధులవుతున్నారు. సాదాసీదాగా ఉండే ఆమె అత్యవసర మీటింగ్ లు, అగ్రనేతల నుంచి అత్యవసర పిలుపులు వస్తే తప్ప విమానాల్లో ప్రయాణించరు. వెంట ఎప్పుడూ ఒక జత డ్రెస్ తెచ్చుకుంటారు. మామూలు భోజనమే చేస్తారు. నాన్ వెజ్ కు దూరం. గాంధేయ సిద్ధాంతం ఆచరణలో భాగంగా ప్రతి శనివారం మౌనవ్రతం పాటిస్తారు. బొకేలు, ఫ్లెక్సీలు, కాన్వాయ్ లకు దూరం. 

ఎక్కడికెళ్లినా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోనే మాజీ ఎంపీ హోదాలో సొంత ఖర్చుతో బస చేస్తారు. సమావేశాలకు సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు. ఇతర గెస్టుల కోసం ఎదురుచూడరు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె పెళ్లి కూడా చేసుకోలేదని చెప్తారు.