
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. గాంధీభవన్‌లో బుధవారం పీసీసీ అబ్జర్వర్ల సమావేశం జరిగింది. అనంతరం ఎంపీలతో మీనాక్షి నటరాజన్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక్కో ఎంపీతో ఆయా నియోజకవర్గ పరిధిలోని పార్టీ సమన్వయం, ప్రభుత్వ పథకాల అమలు, జనం నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీశారు.
ఎంపీలు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ ప్రగతిని ఆమెకు వివరించారు. అనంతరం ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వం చేపడ్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాం. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాం’’అని ఆయన తెలిపారు. మరో ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ.. ‘‘మేము చేస్తున్న కార్యక్రమాలను మీనాక్షి నటరాజన్‌కు వివరించాం. హైదరాబాద్ కు టూరిజం కళ తెచ్చేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తుంటే, బీజేపీ అడ్డుకుంటుందని చెప్పాం’’అని ఆయన అన్నారు.
ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చిన తీరు, రైతులు సంతోషంగా ఉన్న విషయాన్ని వివరించామని అన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. 2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మీనాక్షి నటరాజన్ కు చెప్పామని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ చేపడ్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి కాంగ్రెస్ కే పట్టం కడ్తారని చెప్పినట్లు వివరించారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మీనాక్షి నటరాజన్‌కు వివరించామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు కాంగ్రెస్ పాలనపై నమ్మకం కలిగేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే పథకాల వివరాలను ఎంపీలంతా కలిసి మీనాక్షి నటరాజన్ కు ఓ నివేదిక రూపంలో అందజేశారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కూడా ఉన్నారు.
పార్టీ నిర్మాణంపై సూచనలు చేశారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్నాక మీనాక్షి నటరాజన్ తో తొలిసారి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం గాంధీభవన్ లో మీనాక్షి నటరాజన్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం మీనాక్షి పలు సూచనలు చేశారు. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేకపోయాను. జానారెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో గౌరవం. మంత్రి పదవి విషయంలో ఆయన రంగారెడ్డి జిల్లా నేతలకు లెటర్ ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని చౌటుప్పల్ లో చెప్పాను. దీని గురించి ఎక్కువ మాట్లాడలేను’’అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.