మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు లీడర్ల జోరు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు లీడర్ల జోరు
  • తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం
  • రోడ్​షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి
  • కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్​, మంత్రులు
  • బీజేపీ కూటమికి సపోర్ట్​గా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​
  • ఇప్పటికే రెండుసార్లు పర్యటించినరేవంత్.. మరోసారి టూర్​
  • నాందేడ్  ర్యాలీలో పాల్గొన్న పవన్​.. నేడు చంద్రబాబు పర్యటన!
  • రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. 20న పోలింగ్

హైదరాబాద్​, వెలుగు: మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల టైమ్​ ఇది! గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కూటములుగా బరిలోకి దిగాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. వారిని ప్రభావితం చేసేందుకు ఇటు తెలంగాణ నుంచి, అటు ఆంధ్రప్రదేశ్​ నుంచి ముఖ్య నేతలను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఇప్పటికే ఓ దఫా ప్రచారంలో పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరో దఫా క్యాంపెయినింగ్​ స్టార్ట్​ చేశారు. రోడ్​ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోష్​ పెంచుతున్నారు.

కాంగ్రెస్​ కూటమి (మహా వికాస్​ అఘాఢి)కి మద్దతుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు ఉత్తమ్​, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సీతక్క తదితరులు క్యాంపెయినింగ్​లో పాల్గొంటున్నారు. బీజేపీ కూటమి (మహా యుతి)కి సపోర్ట్​గా రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్​రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్​ వంటి వారు ప్రచార చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ మహా యుతి తరఫున ప్రచారం చేపడ్తున్నారు.ఈ నెల 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు జరగనుండా సోమవారంతో ప్రచారానికి తెరపడనుంది. ఈలోగా వీలైనంత ఎక్కువ ఏరియాలను చుట్టివచ్చేలా తెలుగు లీడర్లు ప్లాన్​ చేసుకున్నారు.

మూడోసారి ప్రచారంలో సీఎం 

మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్లలో ఎక్కువ మంది తెలంగాణ వాళ్లే నివసిస్తుండటంతో ఇటు కాంగ్రెస్​ కూటమి, అటు బీజేపీ కూటమి తెలంగాణ లీడర్లపై ఫోకస్​ పెట్టాయి. వారితో ముమ్మరంగా ప్రచారం చేయిస్తున్నాయి.  కాంగ్రెస్​ కూటమి తరఫున సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికే రెండుసార్లు ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్​ కూటమిని గెలిపించాలని,  అధికారంలో వస్తే ఏం చేస్తుందో చెప్పారు. మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిపై విమర్శలు సంధించారు. ఎంతో గొప్ప వారసత్వం ఉన్న మహారాష్ట్రలో ఇప్పుడు గుజరాత్​ పెత్తనం నడుస్తున్నదని, అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మహా వికాస్​ అఘాడీకి ఓటు వేయాలని ఓటర్లను కలుస్తున్నారు. కాగా, ఆయన తన మూడో విడత క్యాంపెయిన్​ను  శనివారం మొదలుపెట్టారు. 

చంద్రాపూర్​ నియోజకవర్గంలోని గుగస్​లో బహిరంగ సభలో మాట్లాడారు. ఆదివారం కూడా సీఎం రేవంత్​ రోడ్​ షోలు, ర్యాలీలు, సభల్లో పాల్గొననున్నారు.  ఇక మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీతక్క వంటి వారికి ఏఐసీసీ ఇప్పటికే కీలకమైన అబ్జర్వర్స్​ బాధ్యతలు అప్పగించింది. తమకు కేటాయించిన సెగ్మెంట్లలో ఆ ఇద్దరు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, ఎంపీలు మల్లు రవి, చామలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.  

మహాయుతి తరఫున రాష్ట్ర బీజేపీ నేతలు

బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికి మద్దతుగా తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ తదితరులు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముంబైలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఏరియాల్లో కిషన్​రెడ్డి ప్రచారం చేపడ్తున్నారు. నాగ్​పూర్​ జిల్లాలో బండి సంజయ్​క్యాంపెయినింగ్​ సాగుతున్నది. 

బీజేపీకి అండగా ఏపీ లీడర్లు

కేంద్రంలోని ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకు సపోర్ట్​గా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా.. తన తమ్ముడు చనిపోవడంతో ఢిల్లీ నుంచే తిరుగుపయనమయ్యారు. ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆది, సోమవారాల్లో చంద్రబాబు ప్రచా రం చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక జనసేన చీఫ్​, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ రెండురోజుల ప్రచారంలో భాగంగా శనివారం మహారాష్ట్రకు చేరుకున్నారు. ఐదు సభలు, రెండు రోడ్​షోలలో ఆయన పాల్గొనేలా షెడ్యూల్​ ఖరారైంది. శనివారం నాందేడ్​ జిల్లా దెగ్లూర్​లో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 20న మహారాష్ట్రలో పోలింగ్​ జరగనుండగా.. 23న ఫలితాలు వెలువడనున్నాయి. 

ఆ ఏరియాల్లో మనోళ్లే ఎక్కువ

మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా.. అందులో దాదాపు 14 లక్షల మందికిపైగా తెలుగువాళ్లు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్లే  70 శాతం ఉంటారు. తెలంగాణకు, మహారాష్ట్రకు బార్డర్​ ఉండటంతో చాలా మంది ఆదిలాబాద్​,  నిజామాబాద్​, కరీంనగర్​ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్లారు. షోలాపూర్​, భీవండి, నాందేడ్​, పుణె, ముంబై  ఏరియాల్లో తెలంగాణ వాళ్లు సెటిలయ్యారు. అక్కడ వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా మనవాళ్లే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఇటు కాంగ్రెస్​ కూటమి, అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలను స్టార్​ క్యాంపెయినర్లుగా నియమించాయి.