
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ బృందం పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల ధర్నా జరిగిన తీరును పీసీసీ చీఫ్, మంత్రులు, విప్ ఆది శ్రీనివాస్ సోనియాకు వివరించారు. వేలాది సంఖ్యలో బీసీలు తరలివచ్చారని ఆమెకు తెలిపారు. మంత్రులు, ఎంపీలను సోనియా ఆప్యాయంగా పలకరించారు. 2008లో సోనియాను కలిసిన ఆది శ్రీనివాస్ మళ్లీ ఇన్నాళ్లకు కలిశానని ఆమెకు చెప్పి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై జంతర్మంతర్లో జరిగిన ధర్నాలో పాల్గొన్నట్లు సోనియాకు విప్ ఆది శ్రీనివాస్ వివరించారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని, తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్కు వెన్నంటే ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ బృందంతో సోనియా అన్నారు. వారికి చేసే మేలు ప్రజలు మరవరని, బీసీ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పులు తెస్తాయని ఆమె చెప్పారు. మరింత కష్టపడాలని, అందరికి సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సోనియా సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్లో బలంగా కొట్లాడుతామని, కేంద్ర వైఖరిని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లండని తెలంగాణ కాంగ్రెస్ బృందానికి రాహుల్ గాంధీ సూచించారు.
రాష్ట్ర అసెంబ్లీలో పాస్అయిన బీసీ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై బీసీ సంఘాల నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. బీసీలకు 42 శాతం కోటా కోసం బీసీ సంఘాల నేతలు, మేధావులతో పాటు సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేసిన విషయం విదితమే. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను పార్లమెంట్లో ఆమోదించి, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘బీసీల పోరు గర్జన’ పేరుతో ధర్నా చేశారు.