- పలువురు ప్రముఖుల సంతాపం
హైదరాబాద్, వెలుగు : సీతారాం ఏచూరి మృతికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేంద్ర మంత్రులు కిష న్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సంతాపం తెలియజేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ నేతల నివాళి
ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో గురువారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సప్పల్.. సీతారాం ఏచూరి సతీమణి సీమా చిస్తీని కలిసి పరామర్శించారు. ఏచూరి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఏచూరి మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని పీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సంతాపం తెలిపారు.
సీపీఎం ఆధ్యర్యంలో సంతాప సభ
సీతారాం ఏచూరి మృతిపై సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. పార్టీ సిటీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొని.. సీతారం ఏచూరి మృతికి సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ..
ఏచూరి ఆశయ సాధన కోసం కంకణబద్ధులవుతామని తెలిపారు. ఏచూరి మరణం వామపక్షాలకేకాదు, యావత్ దేశానికే తీరని లోటని అన్నారు. నాగయ్య మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేత సీతారాం ఏచూరి అని తెలిపారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ... ఏచూరితో తనకున్న బంధాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు : సీపీఐ
సీతారం ఏచూరి మృతి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి అన్నారు ప్రజాసమస్యలు, దేశ సమస్యలను ప్రస్తావన చేసే ఒక గొంతు మూగబోయిందని తెలిపారు.
ఏచూరి మరణం తీరని లేటు : సీఎం రేవంత్ రెడ్డి
సీతారాం ఏచూరి మరణం తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ‘‘సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడు. ఆయన లేని లోటు పూడ్చలేనిది” అని సీఎం
సంతాపం వెలిబుచ్చారు.
సీతారాం ప్రసంగాలు చరిత్రలో నిలిచిపోతాయి : భట్టి
‘‘సీతారాం ఏచూరి మృతి తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన మరణం సామ్యవాద, ప్రజాస్వామ్య , వామపక్ష భావజాలానికి తీరని లోటు” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులోనూ, 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులోనూ అత్యంత కీలంగా వ్యవహరించి దేశంలో లౌకికవాదం కొనసాగేందుకు కృషి చేశారు. రాజ్యసభ సమావేశాల్లో క్రమం తప్పకుండా పాల్గొనే సీతారం ఏచూరి.. మతతత్వం, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు చరిత్రలో నిలిచిపోతాయి’’ అని తెలిపారు.