- ఇప్పుడు పెన్ను దొరకలేదంటూ ట్రోలింగ్
- మరోమారు కేసీఆర్ తప్పిన మాటలన్నీ తెరపైకి..
- దళితుడే సీఎం, భగీరథ నీళ్లు అన్నీప్రస్తావన
- రుణమాఫీతో రైతులు, కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు, శ్రేణులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేతల హరీశ్ రావు టార్గెట్ గా సామాజిక మాధ్యమాల్లో ముప్పేట దాడికి దిగుతున్నారు. పంద్రాగస్టులోగా పంటరుణమాఫీ చేసి చూపించామని హరీశ్ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ లో తమదైన శైలిలో మాజీ మంత్రిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిద్దిపేటలో పెట్రోల్ పైన పోసుకున్న హరీశ్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదని, ఇప్పుడు రాజీనామా పత్రంపై సంతకం చేసేందుకు పెన్ను దొరకడం లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇదే అదనుగా తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలనూ తెరపైకి తెస్తున్నారు. దళితుడిని ముఖ్యమంత్రినిక చేయకపోతే తలనరుక్కుంటానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను వైరల్ చేస్తున్నారు. అలాగే మిషన్ భగీరథ నీళ్లియ్యకపోతే ఓట్లడగను అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ సీఎం అని రేవంత్ రెడ్డి ఫార్మర్స్ రిఫార్మర్ అంటూ పోస్టర్లను పోస్ట్ చేస్తున్నారు. ఎంపీ రేణుకా చౌదరి హరీశ్ రావు రాజకీయ సన్యాసం తీసుకోవాలని, ఏకంగా కాషాయ వస్త్రాలనే పంపుతాని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా అదే స్థాయిలో స్పందించారు.
గన్ పార్కు వద్దకు ఉద్యమకారులు
అబద్దాల హరీశ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు వివిధ రూపాల్లో చేస్తున్నారు. ఇదిలా ఉండగా అబద్ధాల హరీశ్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు.
నేనలా అనలే: హరీశ్
‘నాకు పదవులు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారినవర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే పదవులకు రాజీనామా ఎన్నిసార్లు చేయడానికైనా వెనుకాడను. రైతు రుణమాఫీ చేసినంత మాత్రానే రాజీనామా చేస్తానని నేను చెప్పలే.. రుణమాఫీతో పాటుగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 హమీలను 100 రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తానన్నాను. కావాలంటే.. అప్పటి నా వీడియో బైట్ చెక్ చేసుకోవాలె.నేను చేసిన సవాలుకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా’