మంత్రులకు ఎస్​.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు నో!

మంత్రులకు ఎస్​.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు నో!
  • ‌‌పలు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల తీరిది
  • అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను పట్టించుకోని జిల్లాల ఉన్నతాధికారులు
  • గ్రామాలకు చిన్న చిన్న పనులు అడిగినా నో రెస్పాన్స్​
  • రూల్స్​ ప్రకారం చేయాల్సి ఉన్నా మంత్రులతో చెప్పించాలంటూ దాటవేత
  • మంత్రులు లేని జిల్లాల్లో ఇన్​చార్జ్​ మంత్రుల మాటే చెల్లుబాటు
  • ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి మరీ దారుణం
  • ఇప్పటికే సీఎం రేవంత్ , పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​కు పలువురి ఫిర్యాదు!
  • ఇటీవల జరిగిన రివ్యూ మీటింగుల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దృష్టికి

హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లో కొందరు కలెక్టర్లు, ఎస్పీల పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ కలుపుకొని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఉన్నతాధికారులు కేవలం ఒకరిద్దరు మంత్రుల మాటనే వింటున్నారు. ముఖ్యమైన నిర్ణయాల వరకు మంత్రులను సంప్రదించడం వరకు ఓకే.. కానీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఓ చిన్న పని మంజూరు కోసం అడిగినా ‘‘ఒక్కసారి మంత్రిని అడిగి చెప్తా’’ అంటూ మెలికపెడ్తున్నారు. మంత్రికి ఇష్టముంటే ఆ నియోజకవర్గంలో ఆ పని శాంక్షన్​ అవుతుంది.

లేదంటే నెలలు గడిచిపోతున్నాయి. ఇక ఎంపీలది విచిత్రమైన పరిస్థితి. లోక్​సభ నియోజకవర్గమంతా వారి పరిధిలో ఉన్నప్పటికీ అందులో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోకీ ధైర్యంగా అడుగుపెట్టే పరిస్థితి లేదు. దిశ మీటింగులు పెడ్తే అధికారులు అసలు స్పందించడం లేదు. ఒకవేళ సమావేశానికి వచ్చినా సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే.. ‘‘మంత్రిని అడిగి చెప్తాం’’ అనడం ఉన్నతాధికారులకు పరిపాటిగా మారింది. ఇక తమనైతే అసలు ప్రభుత్వంతో సంబంధం లేనట్లుగానే చూస్తున్నారని ఎమ్మెల్సీలు వాపోతున్నారు. అధికారులు కనీసం తమను అభివృద్ధి పనుల్లో కలుపుకొని పోకపోతే, గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా మంజూరు చేయించుకోలేకపోతే.. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అంటున్నారు. 

రాబోయే లోకల్​ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్​ పార్టీ క్లీన్​ స్వీప్​ చేసేలా చూడాలని సీఎం రేవంత్​ తమను ఆదేశిస్తున్నారని.. కానీ, గ్రామాల్లో సొంతంగా ఒక సీసీ రోడ్డు కూడా వేయించలేని తాము ఏ మొఖం పెట్టుకొని ప్రజలను ఓట్లడగాలని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రుల అధికారాలను తాము కాదనడం లేదని.. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నారు. 

ఇదే విషయాన్ని పలు జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ ​గౌడ్​కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా పరిస్థితి మారకపోవడంతో తాజాగా లోక్​సభ నియోజకవర్గాలవారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతల నడుమ సమన్వయం కోసం గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన సమావేశాల్లోనూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్​ దృష్టికి తెచినట్లు సమాచారం. ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. పరిస్థితి ఇట్లనే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమస్య అవుతుందని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నో ఉదాహరణలు..

హైదరాబాద్ సిటీని ఆనుకొని ఉన్న ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే.. తన పరిధిలోని ఓ గ్రామంలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు సీసీ రోడ్డు వేయించాలని అడిగారు. వెంటనే ఆయన కలెక్టర్ కు ఫోన్ చేసి, ఆ గ్రామానికి సీసీ రోడ్డు శాంక్షన్​ చేయాలని కోరారు. ‘ఓకే.. నో ప్రాబ్లమ్..  ఒకసారి మీ జిల్లా ఇన్​చార్జ్​ మంత్రితో చెప్పించండి’’ అనే సమాధానం వచ్చింది. ‘‘ఇదేంటి కలెక్టర్ గారు.. ఒక చిన్న పల్లెలో సీసీ రోడ్డు మంజూరు చేయాలంటే  దీనికి కూడా ఇన్​చార్జ్​ మంత్రి చెప్పాల్నా.. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను, అందులో రెండోసారి ఎమ్మెల్యేను’’ అని కలెక్టర్​తో చెప్పుకోగా, ‘‘సారీ.. ఎమ్మెల్యే గారు’’ అంటూ దాటవేశారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్టీ రిజర్వుడ్​ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత.. రెండు గ్రామాల మధ్య చెక్ డ్యాం నిర్మాణం కోసం కలెక్టర్​కు ఫోన్ చేసి కోరగా..‘‘జిల్లా మంత్రి నుంచి ఫోన్ చేయించండి’’ అని కలెక్టర్​ టక్కున ఫోన్ కట్ చేశారు. ఇక కొత్తగా ఏర్పడ్డ ఓ జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు కలెక్టర్​కు ఏ విషయంపై ఫోన్ చేసినా ఆయన ఏమాత్రం స్పందించడం లేదు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే అయినప్పటికీ.. వారికి అక్కడి అధికారుల నుంచి ఎమ్మెల్యే అనే గుర్తింపు లభించడం లేదు. ఆ జిల్లా మొత్తం సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఓ నేత  కనుసన్నల్లో నడుస్తున్నది. హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్ చేస్తే తప్ప ఎమ్మెల్యేల పనులకు మోక్షం లభించడం లేదు. 

ఓ యువ మహిళా ఎమ్మెల్యే పరిస్థితి మరీ దారుణం. ఆమె నియోజకవర్గం కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రం. ఆ పక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేది రాష్ట్రంలోని ఓ కీలక నేత. దీంతో ఆ మహిళా ఎమ్మెల్యేకు ఇటు కలెక్టర్ నుంచి ఇతర అధికారుల నుంచి స్పందనే ఉండడం లేదు. ఏ పనికోసం కలెక్టర్ కు ఫోన్ చేసినా ‘‘చూస్తా.. పరిశీలిస్తా..’’ అనే సమాధానమే వస్తున్నది. 

ఓ యువ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే..  రాజకీయ వారసత్వంతో ఆయన కాంగ్రెస్ తరఫునే ఆ పదవిలోకి మొదటిసారి వచ్చారు. ఆయన తండ్రి రాష్ట్ర రాజకీయాల్లో కనీసం నాలుగు దశాబ్దాల పాటు కీలకంగా పనిచేశారు. కానీ, ఇప్పుడు ఆయన ఏ పని కావాలన్నా మంత్రిని అడగాల్సి వస్తున్నది. మంత్రి చెప్తే తప్ప తన నియోజకవర్గంలో ఆయన పనులు జరిగే పరిస్థితి లేదు. తన కొడుకును ఎవరూ పట్టించుకోవడం లేదని చాలా సందర్భాల్లో ఆ పెద్దాయన జోక్యం చేసుకోవాల్సి వస్తున్నదంటే  సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

మొదటిసారి ఎన్నికైన మరో ఎమ్మెల్యే.. తన జిల్లా కలెక్టర్​కు ఫోన్ చేస్తే రెస్పాండ్ కారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ‘‘సార్ మీటింగ్ లో ఉన్నారు” అనే సమాధానం వస్తుంటుంది. కింది స్థాయి అధికారులకు ఆ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే.. ‘‘సార్ మీరు ఒకసారి కలెక్టర్ నుంచి ఫోన్ చేయించండి’’ అనే ఆన్సర్​ వస్తుంటుంది. ‘‘అధికార పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన  ఇంత నిర్లక్ష్యం చేయాలా?  మొదటిసారి ఎమ్మెల్యే అయినవారు ప్రజల్లో తిరగాలి.. వాళ్ల సమస్యలు పరిష్కరిస్తూ జనంతో మమేకం కావాలి.. అలాగైతేనే మళ్లీ రెండోసారి గెలుస్తారు.. అని సీఎం చెప్తున్నారు.. కానీ కింద పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ప్రతిదానికి జోలె పట్టుకొని మంత్రి దగ్గరికి వెళ్లలేం కదా?’’ అంటూ ఆ ఎమ్మెల్యే వాపోతున్నారు. 

ఓ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో పనులు అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఇద్దరు మంత్రికి విధేయులు. దీంతో సదరు మంత్రి వాళ్లిద్దరూ ఏ పని అడిగినా చేసి పెట్టాలంటూ అక్కడి కలెక్టర్​కు ఆదేశాలు ఇచ్చారు. ఇంకేముంది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంత చెప్తే అంత.. మంత్రి ఆశీస్సులు ఉంటే ఎమ్మెల్యేల పనులు ఎంత వేగంగా జరుగుతాయో, మంత్రి ఆదరణ లేకపోతే ఆ పనులు నెలల తరబడి పెండింగ్ ​పడిపోతున్నాయి. 

ఎంపీలదీ ఇదే పరిస్థితి.. 

యువకుడైన ఓ ఎన్నారై  కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికై.. ఇప్పుడు అల్లాడుతున్నారు. ఆయన పార్లమెంట్ పరిధిలో అధికారిక పర్యటనలు చేయడానికి వీలులేదు. సంబంధిత మంత్రి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి ముందస్తు అనుమతి ఉంటేనే ఆయన ఎంపీ హోదాలో అక్కడ అధికారిక పర్యటన చేయాలి. లేదంటే లేదు. 
ఉత్తర తెలంగాణలోని ఓ  మంత్రికి తన జిల్లా పరిధిలోని ఓ యువ ఎంపీ అంటే చిన్నచూపు మొదలైంది. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ తర్వాత దూరం పెట్టడం ప్రారంభించారు. ఆ ఎంపీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బంది అనుకున్నరో ఏమోగానీ అక్కడి కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంపీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది దాని సారాంశం. అంతే, ఇక ఆ ఎంపీ తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తే అధికారుల నుంచి సరైన స్పందన ఉండడం లేదు. 

దిశ మీటింగ్ నిర్వహిస్తే సరైన సమాచారంతో రావడం లేదు. గట్టిగా అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు. చిత్రమేమిటంటే ఆ మీటింగ్​కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా రావడం లేదు. మంత్రి ఆదేశాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మరో ఎంపీ ఉన్నారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ, ఆయన్ను అక్కడి మంత్రులు పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆయన సీనియార్టీని కనీసం అధికారులైనా గుర్తించి, గౌరవించే పరిస్థితి లేదు. దీంతో ఆయన తనకు ఎదురయ్యే ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే మదనపడుతున్నారు.

ఎందుకిట్ల..?

కాంగ్రెస్​లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, కలెక్టర్లకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందనే చర్చ ఇటు కాంగ్రెస్​లో, అటు సీఎంవోలో హాట్​ టాపిక్​లా మారింది. కొందరు మంత్రులు, ఇన్​చార్జ్​ మంత్రుల నుంచి కలెక్టర్లకు వెళ్లిన ఆదేశాలతోనే ఈ పరిస్థితి ఎదురవుతున్నదనే  చర్చ నడుస్తున్నది. జిల్లాల్లో తమ ఆధిపత్యం కొనసాగాలి.. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే తమ ముందు జీ హుజూర్ అనేలా ఉండాలనే కొందరు మంత్రుల తీరే  ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. కొందరు మంత్రుల ఆధిపత్య ధోరణి కారణంగా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నియోజకవర్గాల్లో చిన్నచిన్న  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు కూడా మంత్రులే హాజరవుతున్నారని చెప్తున్నారు. 

తాము గ్రామాలకు చిన్న పనులను కూడా మంజూరు చేయించలేకపోతున్నామని, ఇలాగైతే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో తాము ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమని, పార్టీ కార్యకర్తలను ఎన్నికల ప్రచారంలో ఎలా పనిచేయించగలమని ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. ఎమ్మెల్సీల పరిస్థితి అయితే మరీ దారుణం. వారికి అసలు గుర్తింపు అనేదే లేకుండా పోయింది. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్​కు తమ పరిస్థితిపై మొరపెట్టుకున్నట్లు తెలిసింది. తాజాగా కాంగ్రెస్ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ తో పార్లమెంట్​స్థానాల వారీగా జరుగుతున్న రివ్యూ మీటింగులలోనూ ఇదే విషయాన్ని  ప్రస్తావించినట్లు సమాచారం.  తమ నియోజకవర్గాల్లో మంత్రుల పెత్తనాన్ని తగ్గించడంతో పాటు నిర్ణయాల్లో తమకు ప్రయారిటీ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలిచ్చేలా చూడాలని కోరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

సమన్వయలోపంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ 

ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లే.. పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొంతమంది మంత్రుల సహకారం లేకపోవడం వల్లే తాను ఓడిపోయానంటూ హైకమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై హైకమాండ్ ఇప్పటికే పీసీసీని వివరణ కోరింది. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.