ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి..మంత్రి నితిన్ గడ్కరీకి కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి

ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి..మంత్రి నితిన్ గడ్కరీకి కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి
  • కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌‌లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆయన ఆఫీసులో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి కలిసి, వినతి పత్రం అందజేశారు. ఉత్తర భాగంలోని సంగారెడ్డి– -నర్సాపూర్– -తూఫ్రాన్– -గజ్వేల్– జగదేవ్‌‌పూర్‌‌– భువనగిరి– చౌటుప్పల్‌‌ను ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్‌‌లోకి మార్చినందున గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే.. ఉత్తర భాగానికి సమాంతరంగా దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని వారు కోరారు. ఓఆర్ఆర్ మీదుగా ఉన్న హైవేల నుంచి హైదరాబాద్ నాలుగు వైపుల ట్రాఫిక్ మళ్లింపు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఓఆర్ఆర్ 15 ఏండ్ల కింద నిర్మించిందని, ప్రస్తుతం ఈ నేషనల్ హైవేలు సిటీలోకి వచ్చాయన్నారు.

మరోవైపు, ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఫార్మా ఇండస్ట్రీస్, లాజిస్టిక్ పార్కులు విస్తరించాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ అవశ్యకత ఎంతో ఉందని వివరించారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మీడియాకు ఎంపీ మల్లు రవి వెల్లడించారు.