నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. గురువారం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, కడియం కావ్య, బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మిగిలిన ఎంపీలు ఈ లేఖ అందజేశారు. తర్వాత పీఎంవోలోనూ లేఖ అందజేశారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పలుమార్లు మోదీ, కేంద్ర మంత్రులను కలిశారని లేఖలో పేర్కొన్నారు. ఐఐఎం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు అభివృద్ధి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని గుర్తు చేశారు. విభజన చట్టంలో పొందుపర్చినట్లు ఏపీకి మాత్రం అన్ని హామీలు అమలు చేశారని పేర్కొన్నారు.