గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపైనే కాంగ్రెస్ ఫోకస్!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపైనే కాంగ్రెస్ ఫోకస్!
  • సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తు
  • మూడు పేర్లతో హైకమాండ్ కు లిస్టు.. 5లోపు అభ్యర్థి ప్రకటన 
  • రేసులో నరేందర్ రెడ్డి, రమణారెడ్డి, వెలిచాల, ప్రసన్న హరికృష్ణ 
  • టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో వామపక్షాలకు మద్దతు 

హైదరాబాద్, వెలుగు: రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో దాన్ని తిరిగి దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నది. ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే కమిటీని నియమించింది. ఈ కమిటీ మూడు పేర్లను పీసీసీకి సిఫారసు చేసింది. ఆ పేర్లను హైకమాండ్ కు పీసీసీ పంపించింది. ఈ పేర్లలో ఏదో ఒకటి హైకమాండ్ ఫైనల్ చేయనుంది. వచ్చే నెల 5 లోపు అభ్యర్థి ప్రకటన ఉంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. 

ఆసక్తి చూపని జీవన్ రెడ్డి.. 

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇది పార్టీకి సిట్టింగ్ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. మార్చితో ఆయన పదవీకాలం ముగియనుంది. జీవన్ రెడ్డినే తిరిగి నిలబెట్టాలని రెండు నెలల కింద గాంధీభవన్ లో జరిగిన పీసీసీ సమావేశంలో పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో పోటీకి జీవన్ రెడ్డి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నందున.. ఆ కోటాలో ఎమ్మెల్సీ కావాలని జీవన్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఆయన దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నాయి. 

టికెట్ రేసులో నలుగురు.. 

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు నుంచి పోటీకి పలువురు విద్యాసంస్థల అధినేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, అమిగోస్ విద్యాసంస్థల యజమాని ముస్కు రమణారెడ్డి టికెట్ రేసులో ముందంజలో ఉన్నారు. వీరితో పాటు విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ, కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు కూడా పోటీలో ఉన్నారు. అయితే నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్నే ఎక్కువ మంది కోరుకుంటున్నారని, ఆయనకే పార్టీ టికెట్ దక్కుతుందని ఇటీవల మీడియాతో చిట్ చాట్ లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ సంకేతం ఇచ్చారు.

కానీ ఆ తర్వాత హైకమాండ్ దే తుది నిర్ణయమంటూ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ కీలక నేతలను కలుస్తూ, టికెట్ తనకే ఇవ్వాలని నరేందర్ రెడ్డి కోరుతున్నారు. ముస్కు రమణారెడ్డి కూడా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్, మంత్రులు ఉత్తమ్, పొన్నం,  పొంగులేటి, సీతక్క తదితరులను కలిశారు. ఇక ప్రసన్న హరికృష్ణ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. మరోవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు కూడా టికెట్ కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఆ రెండు సీట్లలో పోటీకి దూరం.. 

కరీంనగర్ గ్రాడ్యుయేట్ సీటుతో పాటు వరంగల్-–ఖమ్మం–నల్గొండ, కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే టీచర్ ఎమ్మెల్సీ సీట్లలో అభ్యర్థులను నిలిపేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపించడం లేదు. మిత్రపక్షాలైన వామపక్షాలకే ఆ రెండు సీట్లను వదిలిపెట్టాలనే అభిప్రాయం మెజార్టీ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ తరఫున పోటీకి ఈ రెండు నియోజకవర్గాల నుంచి పలువురు ఆసక్తి చూపిస్తున్నా, ఆశావహులు గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నా... పోటీకి దూరంగా ఉండడమే మేలు అనే అభిప్రాయంతో పీసీసీ ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై త్వరలోనే పీసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.